మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేల్లో అధికులు నేర చరితులే అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ (ఏడీఆర్) ప్రకటించింది. ఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్‌లను విశ్లేషించిన తర్వాత ఈ వివరాలను వెల్లడించింది.
అంశాలవారీగా వివరాలు..
రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాల్లో 176 మంది ఎమ్మెల్యేలు క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఏడీఆర్ న్యాయవాదుల బృందం తెలిపింది. ఎన్నికల్లో గెలుపొందిన 285 మంది ఎమ్మెల్యేల ప్రమాణపత్రాలను విశ్లేషించామని అందులో 62 శాతం మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టం చేసింది.
వీరిలో 113 మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయని వివరించింది. మొత్తం మహారాష్ట్ర శాసనసభలో 40 శాతం మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయిు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల అఫిడవిట్లు అందుబాటులో లేనందున వాటిని విశ్లేషించలేదని ఏడీఆర్ తెలిపింది.
గతం కన్నా ఎక్కువ
2014లో మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికైన 165 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉండగా... అందులో 115 మందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయని ఏడీఆర్ అప్పట్లో ప్రకటించింది. ఈ ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
93 శాతం కుబేరులు
గత శాసనసభలో 254 మంది అంటే 88 శాతం కోటీశ్వరులు ఉంటే ఇప్పుడు శాసనసభకు ఎన్నికైన వారిలో 264 మంది అంటే 93 శాతం మంది కుబేరులు ఉన్నారని గణాంకాలు వెల్లడించాయి. ఈసారి ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తి 22కోట్ల 42 లక్షలని వివరించిన ఏడీఆర్... 2014లో ఇది 10 కోట్ల 87 లక్షల రూపాయలే అని తెలిపింది.
ఆస్తుల పెరుగుదల
2014లో గెలిచిన 118 మంది ఎమ్మెల్యేలు ఈ సారి కూడా తిరిగి విజయం సాధించారు. వీరి సగటు ఆస్తులు 25 కోట్ల 86 లక్షలకు పెరిగాయని ఏడీఆర్ పేర్కొంది.