మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి అతివేగంతో ప్రైవేటు బస్సు ఢీకొనడం వల్ల 9 మంది మృతి చెందారు. రీవా నుంచి సిధి జిల్లాకు బస్సు ప్రయాణిస్తుండగా గుద్ రోడ్డు సమీపంలో ఉదయం 6.30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.
బస్సు ముందు భాగంలో కూర్చున్న ప్రయాణికులంతా సీట్ల మధ్య ఇరుక్కుపోయి చనిపోయారు. ప్రైవేటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు.