దేశంలో కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్య 7 కోట్లు దాటినట్లు వెల్లడించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. రోజుకు సగటున 14 లక్షల టెస్టులు నిర్వహించే సామర్థ్యానికి చేరుకుందని స్పష్టం చేసింది. ప్రతి 10 లక్షల జనాభాకు 50 వేల 920 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించింది. బాధితులు వేగంగా కోలుకుంటున్నారని తెలిపిన ఆరోగ్య శాఖ.. కరోనా పాజిటివిటీ రేటు 8.40 శాతంగా ఉందని స్పష్టం చేసింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజూ నమోదవుతున్న కరోనా కేసుల్లో 75 శాతం 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుంచే ఉంటున్నాయని తెలిపింది. అవి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, దిల్లీ, బంగాల్, ఛత్తీస్‌గఢ్ కొత్త కేసుల నమోదులో వరుసగా 10 స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది ఆరోగ్య శాఖ.
24 గంటల వ్యవధిలో నమోదైన మరణాల్లో ఈ రాష్ట్రాల నుంచే 83 శాతం ఉన్నాయని తెలిపింది.

భారత్‌లో కొత్తగా 85 వేల 362 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1089 మంది కొవిడ్‌కు బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 59 లక్షల మార్కు దాటింది. మరణాలు 93 వేల 379కి చేరాయి.