నిరుద్యోగులే లక్ష్యంగా బెంగళూరుకు చెందిన 'రూ.10 గ్యాంగ్' లక్షలు కాజేసింది. పెద్ద కంపెనీల్లో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఉద్యోగార్థులను మోసం చేసింది. కేవలం రూ.10 కడితే ప్రముఖ సంస్థలో ఉద్యోగి కావచ్చని నమ్మబలికి వారి అకౌంట్ నుంచి సునాయాసంగా డబ్బులు లూటీ చేసింది. తేరుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది.
బెంగళూరులోని హనుమంత్నగర్కు చెందిన ఓ యువతికి ఈ ముఠా సభ్యుడు ఫోన్ చేసి 42 వేలు కాజేశాడు. ఇలాంటి అనుభవమే కోరమంగళకు చెందిన మల్లికకు కూడా ఎదురైంది. కేటుగాళ్ల మాటలు నమ్మి లక్ష రూపాయలు ముట్టజెప్పుకుంది మల్లిక. ఇలా మరికొన్ని కేసులు నమోదు కావడం చూసి వీటిపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు.
మోసం ఇలా...
'మీరు పది రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించండి. ప్రముఖ కంపెనీలో మేము ఉద్యోగం కల్పిస్తాము' అని ఫోన్ చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు పంపి.. అన్నింటినీ నింపమని చెప్తారు. అందులో బ్యాంక్ అకౌంట్ వివరాలు, డెబిట్ కార్డ్ నంబర్, సీవీవీ కూడా నింపమని చెబుతారు. అంతే.. ఉద్యోగం మీద ఆశతో నమ్మి వివరాలు సమర్పించాం అంటే బ్యాంక్ ఖాతాకు చిల్లుబడినట్లే. ఇలాంటి వాటిని నమ్మి వివరాలు ఎవరికీ ఇవ్వద్దని అంటున్నారు బెంగళూరు పోలీసులు.