నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 6గంటలకు ప్రారంభమైన బంద్ సాయంత్రం ఆరు గంటల వరకు సాగింది. 12 గంటలపాటు జరిగిన బంద్‌లో.. ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోని రహదారులను రైతులు దిగ్బంధించారు. పలు చోట్ల రైతులు రైల్వే ట్రాక్‌లపై బైఠాయించారు. ఉత్తర భారతంలోనే బంద్ ప్రభావం ఎక్కువగా కనపడింది.
దిల్లీ-యూపీని కలిపే ఘాజిపూర్ సరిహద్దు వద్ద రోడ్లపై నృత్యాలు చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు ఆందోళన చేశారు. సింఘు, గాజీపుర్, టిక్రీ సరిహద్దులో జాతీయ రహదారిపై అన్నదాతలు బైఠాయించారు. అమృత్‌సర్‌లోని రైల్వే ట్రాక్‌పై అన్నదాతలు అర్ధనగ్న ప్రదర్శన చేయగా.. కర్ణాటకలో వామపక్ష నేతలు ఆందోళన చేపట్టారు.
![Bharat Bandh underway; rail, road transport affected](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11171321_bundhh.jpg)
![Bharat Bandh underway; rail, road transport affected](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11171321_bundhhh.jpg)
బంద్ నేపథ్యంలో నాలుగు శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేయగా పంజాబ్, హరియాణాలోని 44 ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 35 ప్యాసెంజర్, 40 గూడ్స్ రైళ్లు బంద్ వల్ల ప్రభావితం అయినట్లు రైల్వేశాఖ పేర్కొంది. బంద్ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా భద్రతా బలగాలను మోహరించారు.
![Bharat Bandh underway; rail, road transport affected](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11171321_bundh.jpg)
''పంజాబ్, హరియాణా పరిమిత రైళ్లు మినహా.. దేశవ్యాప్తంగా ఈ బంద్ ప్రభావం దాదాపు శూన్యం. మొత్తంగా 0.5 శాతం కంటే తక్కువ రైళ్లు ప్రభావితం అయ్యాయి.''
-డీజే నరేన్, రైల్వే అధికారి
ఇదీ చదవండి: 'రైతు ఉద్యమాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపేదిలేదు'