Bhagwant Mann: భగవంత్ మాన్.. 1973 అక్టోబరు 17న పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలో జన్మించారు. షహీద్ ఉధంసింగ్ ప్రభుత్వ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చిన్నతనం నుంచే హాస్యచతురత కలిగిన మాన్.. కాలేజీ రోజుల్లో యూత్ కామెడీ ఫెస్టివల్స్‌లో పాల్గొనేవారు. ఆ తర్వాత అదే కెరీర్‌గా ఎంచుకున్నారు. రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు తదితర అంశాలపై తనదైనశైలిలో హాస్యాన్ని జోడిస్తూ అనతికాలంలో ప్రేక్షకాదరణ పొందారు. ఆయన చేసిన జుగ్ను కెహెందా హై, జుగ్ను మస్త్ మస్త్ వంటి బుల్లితెర కార్యక్రమాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. తను చేసిన టీవీ కార్యక్రమం జుగ్ను పేరును ముద్దుపేరుగా మార్చుకున్నారు. 2008లో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్‌తో ప్రపంచ దేశాల్లో ఎంతో పేరుతెచ్చుకున్న మాన్.. పలు చిత్రాల్లోను నటించి మెప్పించారు.
కమెడియన్ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి..
కమెడియన్‌గా ఎంతో గుర్తింపు పొందిన భగవంత్ మాన్.. 2011లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్‌లో చేరి 2012 శాసనసభ ఎన్నికల్లో లెహ్రా నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి.. సంగ్రూర్ లోక్‌సభ స్థానం నుంచి 2లక్షలకు పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. 2017లో జరిగిన పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో జలాలాబాద్ నుంచి పోటీచేసి.. అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2019లో పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి సంగ్రూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి వరుసగా రెండోసారి విజయం సాధించారు. ప్రస్తుతం లోక్‌సభలో ఆప్ తరఫున ఉన్న ఏకైక ఎంపీగా ఉన్న ఆయన.. ఈసారి ధురి శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో మూడోసారి పోటీచేసి తొలిసారి గెలుపొందిన భగవంత్ మాన్.. ఏకంగా సీఎం పీఠాన్నే అధిరోహించనున్నారు.
మద్యం మానేస్తున్నట్లు ప్రమాణం...
ఎంతో ప్రజాదరణ కలిగిన మాన్.. అనేక వివాదాల్లోను చిక్కుకున్నారు. 2016లో ఒకసారి పార్లమెంట్ ప్రాంగణాలను లైవ్ స్ట్రీమ్ చేయడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. పార్లమెంట్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒకసారి మద్యం సేవించి లోక్‌సభకు వచ్చారని కొందరు ఎంపీలు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈసారి ఎన్నికల ప్రచారం సమయంలోను ప్రత్యర్థి పార్టీలు అదే అంశాన్ని ప్రస్తావిస్తూ మాన్‌పై విమర్శలు గుప్పించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో.. మద్యం మానేస్తున్నట్లు బహిరంగంగా ఆయన ప్రమాణం చేశారు.
పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో ఈసారి ఎలాగైన విజయం సాధించాలన్న లక్ష్యంతో ఆప్ సరికొత్త పంథా ఎంచుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రజల నిర్ణయానికే వదిలేసిన ఆప్.. ఇందుకోసం ప్రత్యేకంగా ఓటింగ్ నిర్వహించింది. భగవంత్ మాన్‌కే 90శాతానికిపైగా ఓట్లు రావటంతో.. ఆయననే సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఆ సందర్భంగా.. మాన్ ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఒకప్పుడు ప్రజలు తనను చూసి నవ్వారని, ఇప్పుడు ఏడుస్తూ సాయం కోసం తమవైపు చూస్తున్నారని పేర్కొన్నారు. పంజాబ్ ప్రజల కోసం తప్పకుండా గెలుస్తామని భగవంత్ మాన్ ధీమా వ్యక్తం చేశారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో ఆప్ ప్రభంజనం సృష్టించటంతో.. భగవంత్ మాన్ సీఎం పగ్గాలు చేపట్టనున్నారు.
ఇదీ చదవండి: నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటిన భాజపా.. పంజాబ్‌లో ఊడ్చేసిన ఆప్