బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 43 నియోజకవర్గాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. 303 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కరోనా ఉద్ధృతి మధ్య నాలుగు జిల్లాల్లోని 14,480 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరరగనుంది.
పటిష్ఠ భద్రత..
నాలుగు, ఐదో దశ ఎన్నికల సందర్భంగా చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. పోలింగ్ జరగనున్న 43 నియోజకవర్గాల్లో 1071 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినట్లు వివరించారు. కరోనా నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
బరిలో ప్రముఖులు..
భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, టీఎంసీ మంత్రులు జ్యోతిప్రియో మల్లిక్, చంద్రిమా భట్టాచార్య, సీపీఎం నేత తన్మయ్ భట్టాచార్యలు పోటీ పడుతున్న నియోజకవర్గాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. టీఎంసీ నుంచి బరిలో ఉన్న సినీ దర్శకుడు రాజ్ చక్రబర్తి, నటి కౌశనీ ముఖర్జీల స్థానాలకూ ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది.
ఇప్పటివరకు బంగాల్లో 180 నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తైంది. మిగిలిన 114 స్థానాలకు ఏప్రిల్ 22 నుంచి 29 మధ్య ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాల లెక్కింపు ఉంటుంది.
ఇవీ చదవండి: పోలింగ్ కుదించాలని కోరుతూ ఈసీకి వినతిపత్రం