ప్లాస్టిక్ నుంచి పెట్రోల్, గ్యాస్ తయారీ.. వినడానికి కొత్తగా ఉన్నా ఇది నిజమే. రోజురోజుకూ పెట్రో ధరలు ఆకాశాన్నంటుతుండటం వల్ల వాహనాలు బయటకి తీయాలంటేనే జనం జంకుతున్నారు. పెట్రో ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇంధన ధరలు పెరుగుతున్న వేళ.. తన 12 ఏళ్ల పరిశోధనతో ఈ సమస్యకు చక్కని పరిష్కారం చూపారు డాక్టర్. పూర్ణేందు చక్రవర్తి. బంగాల్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో పీజీ చేసిన ఆయన.. పెట్రోలియం రంగంలో పీహెచ్‌డీ పూర్తిచేశారు. తర్వాత నేషనల్ పెట్రోలియం కంపెనీలో 32 ఏళ్లు పనిచేసి విశ్రాంతి పొందారు. ప్రస్తుతం శాంతినికేతన్ ప్రాంతంలోని శ్రీపల్లిలో నివసిస్తున్నారు.
పెట్రోలియం ఉత్పత్తులపై అపార జ్ఞానాన్ని సముపార్జించిన పూర్ణేందు ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా పర్యావరణానికి తీరని హాని జరుగుతోందని భావించేవారు. దీనికి పరిష్కారంగా ఆయన ఓ యంత్రాన్ని తయారుచేశారు. ఇది ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తక్కువ సమయంలోనే పెట్రోలు, గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పరిశోధనను ధ్రువీకరిస్తూ మేధో హక్కుల విభాగం.. ఇప్పటికే ఆయనకు సమాచారం పంపింది.
కిలో ప్లాస్టిక్ నుంచి 950 గ్రాముల ద్రవరూప గ్యాస్ వస్తోందని పూర్ణేందు చెబుతున్నారు. ఈ యంత్రం ద్వారా తన ఇంటి అవసరాల కోసం ద్రవరూప గ్యాస్‌ను ఉత్పత్తి చేసి.. వంటకు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. తక్కువ సామర్థ్యము ఉండే ఇంజిన్లకు, కార్లకు ఈ గ్యాస్‌ను అలాగే వాడుకోవచ్చని పూర్ణేందు వివరించారు.
ఇదీ చదవండి:దేశీయ తొలి డ్రైవర్‌లెస్ విద్యుత్ వాహనం వచ్చేసింది