Beed road accident మహారాష్ట్ర.. బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు, టెంపో ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మంజర్సుంబ- పటోడా హైవేపై ఆదివారం ఉదయం 5.30 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీడ్ జిల్లా కేజ్ సమీపంలోని జివాచివాడి గ్రామానికి చెందిన ఓ కుటుంబం పుణెలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న టెంపో ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురిలో ఒకే కుటుంబానికి చెందినవారు ఐదుగురు ఉన్నారు. రెండు వాహనాలను వేరు చేసేందుకు పోలీసులు క్రేన్‌ను ఉపయోగించారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు..
గుజరాత్.. భావ్‌నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వల్లభిపుర్ సమీపంలోని హైవేపై ఆగి ఉన్న డంపర్ ట్రక్కును కారు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన శనివారం రాత్రి 11 గంటలకు జరిగిందని పోలీసులు తెలిపారు.
మృతులు సూరత్ నుంచి అమ్రేలీ జిల్లాలోని తమ స్వగ్రామమైన ఝరాకియాకు వెళ్తుండగా.. వారి కారు పక్కనే ఆగి ఉన్న డంపర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు, వారి 15 ఏళ్ల కుమారుడు అక్కడికక్కడే మరణించాడు. దంపతుల మేనల్లుడు తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ భావ్‌నగర్ ఆసుపత్రిలో మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: ఆడ కోతి ప్రేమను ఎరగా వేసి రౌడీ కోతిని బంధించిన అధికారులు