వరకట్నం కారణంగా పీటల దాకా వచ్చి ఆగిపోయిన పెళ్లిల్లు ఎన్నో ఉన్నాయి. అలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్ బరేలీలో జరిగింది. అయితే.. ఇక్కడ కట్నం అడిగిన వరుడికి పెళ్లి కూతురే షాకిచ్చింది. కట్నం కోసం పట్టుబట్టిన అతనితో తనకు పెళ్లి వద్దని తెగేసి చెప్పింది.
ఇదీ జరిగింది..
పర్తాపుర్ చౌధరీ గ్రామానికి చెందిన ఖలీల్ ఖాన్ కూతురు కుల్సుమ్కు జీషన్ ఖాన్‌తో వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరిలో వారి నిశ్చితార్థం జరిగిన సమయంలో వరకట్నానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదు.
రెండు రోజుల క్రితం బరాత్ పెట్టుకోగా, దానికోసం తాహతుగా తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు ఖలీల్. కట్నకానుకలు కూడా సిద్ధం చేశారు. అయితే ఆకస్మికంగా బైకు డిమాండ్ చేశాడు వరుడు. లాక్డౌన్ అయినందున తక్షణం కొనుగోలు చేయడం వీలుపడదని చెప్పగా.. బుల్లెట్ ధర రూ.2.30లక్షలు అయినా చెల్లించాలని పట్టుబట్టాడు.
అప్పటికప్పుడు ఆ మొత్తాన్ని ఏర్పాటు చేయగలిగారు ఖలీల్. కానీ, కాసేపటికే అనారోగ్యం బారినపడ్డారు. దీంతో అతిథులందరి ముందే ఆ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది వధువు. తండ్రి సహా ఎవరు ఎంత చెప్పినా వినలేదు. చివరకు వారి వివాహం రద్దు అయ్యింది.
ఇదీ చూడండి: కొత్త రకం కట్నం కోరిన ఐఏఎస్ అధికారి!