కర్ణాటక బెంగళూరులోని ఓ బాబా ఆలయాన్ని వినూత్నంగా అలంకరించి భక్తులను ఆశ్చర్యానికి గురిచేశారు అక్కడి ఆలయ నిర్వాహకులు. జేపీ నగర్లో ఉన్న శ్రీ సత్య గణపతి సాయి కోవెలను 'గురు పౌర్ణమి' సందర్భంగా కరోనా మాస్కులు, ఔషధాలు, పోషక పదార్థాలతో అలంకరించి అబ్బురపరిచారు.
ఇందుకోసం 3 లక్షల పిల్స్, 10 వేల మాస్కులు, 2 వేల శానిటైజర్లను ఉపయోగించారు.
కరోనా మూడో దశపై అవగాహన కల్పించేందుకే ఈ వినూత్న ప్రయత్నం చేసినట్లు ఆలయ ట్రస్టీ రామ్ మోహన్ రాజ్ తెలిపారు. కిట్లను మరో నాలుగు రోజుల్లో ప్రజలకు అందజేయనున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రత్యేక అలంకరణను తిలకించేందుకు దక్షిణ బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య ఆలయానికి విచ్చేశారు.
రూ.లక్షలు ఖర్చు పెట్టి వ్యర్థంగా మిగిలిపోయే అలంకరణలు చేయడం కన్నా ప్రజలకు ఉపయోగపడేలా చేయడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు.
ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో వెళుతున్నారు.
ఇదీ చూడండి: Guru Purnima : గురుపరంపరకు ఆద్యుడు.. వ్యాసభగవానుడు