వెదురు ఆకుల నుంచి ఆహ్లాదపరిచే టీ తయారు చేస్తున్నారు త్రిపురకు చెందిన గిరిజన వ్యాపారి సమీర్ జమాతియా. ఈ పానీయానికి ఛాయ్ ప్రియులు సహా ఇతర రాష్ట్రాల్లోని వర్తకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీనిని దేశంలోనే కాదు, విదేశాల్లోనూ విక్రయించేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు.

గోమటి జిల్లా గర్జీకి చెందిన సమీర్.. బ్యాంబూ సాంకేతిక నిపుణుడు. ఉద్యోగ రీత్యా చైనాలో చాలా కాలం నివసించారు. జపాన్, వియత్నాం, కాంబోడియాలోనూ పర్యటించారు. అక్కడ సంపాదించిన అనుభవంతో వెదురు టీని తయారు చేస్తున్నారు.
ఎగుమతులకు ఆదరణ..
ఇప్పటికే దీనిని దిల్లీకి చెందిన ఓ ఎగుమతిదారునికి 500 కిలోలు సరఫరా చేసినట్లు చెప్పారు సమీర్. తమిళనాడుకు చెందిన మరో వ్యాపారి వెదురు టీ తయారీ ప్రక్రియ నేర్చుకోవడానికి 3 రోజుల త్రిపురలోనే ఉన్నట్లు వెల్లడించారు.

ఈ పానీయంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బయోటిక్లు అధికంగా ఉంటాయని సమీర్ చెప్పారు. 30 రకాల వెదురులతో ఈ పానీయాన్ని తయారు చేయవచ్చని తెలిపారు.
ఇదీ చూడండి: ఈ టీలు తాగితే.. హాయిగా నిద్రపట్టేస్తుంది!