Bail to TDP Leaders in Angallu Incident Case: పుంగనూరు, అంగళ్లు కేసులో టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 79 మంది నేతలకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. బెయిల్ వచ్చినవారు ప్రతి మంగళవారం పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని ఆదేశించింది.
మరో వైపు ఎమ్మెల్సీ రామ్‌భూపాల్‌రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇవే కేసుల్లో ముందస్తుగా మరో 30 మంది టీడీపీ నేతలు బెయిల్ పిటిషన్ వేశారు. వీరందరినీ తదుపరి విచారణ వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ బెయిల్ మంజూరైన 79 మంది టీడీపీ నేతలు ప్రస్తుతం చిత్తూరు, మదనపల్లె, కడప జైళ్లలో ఉన్నారు.
పుంగనూరు, అంగళ్లు ఘటన.. వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై కొనసాగిస్తున్న విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా.. టీడీపీ అధినేత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన జిల్లాలోని పుంగనూరు బయల్దేరగా.. అంగళ్లు వద్ద చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేశారు.
అడ్డుకోవటం మాత్రమే కాకుండా వైసీపీ శ్రేణులు మరింత రెచ్చిపోయి రాళ్లు, కర్రలతో టీడీపీ నేతలపై దాడికి దిగారు. ఈ దాడిలో చాలా మంది టీడీపీ నేతలు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఫ్లేక్సీలను వైసీపీ శ్రేణులు చించివేయటంతో మరింత ఉద్రిక్తత నెలకొంది.