Bahubali Samosa Meerut : పుట్టినరోజు సందర్భంగా.. కేక్ బదులు 12 కిలలో 'బాహుబలి' సమోస కట్ చేస్తే ఎలా ఉంటుంది? వినేందుకు వింతగా ఉంది కదా? ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో మాత్రం అలానే చేస్తున్నారు. ఆ సమోసాను 30 నిమిషాల్లో ఆరగించి రూ. 71,000 ప్రైజ్‌మనీ గెలిచేందుకు పోటీపడుతున్నారు.
Bahubali Samosa Challenge : మేరఠ్ ప్రాంతంలోని లాల్కుర్తీకి చెందిన కౌశల్ స్వీట్స్ యజమాని శుభమ్ కౌశల్.. తాను తయారు చేసే సమోసాలకు గుర్తింపు వచ్చేలా ఏదైనా చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా మొదట 4 కిలోల సమోసా చేయడం ప్రారంభించాడు. దానికి ఆదరణ రావడం వల్ల.. ఎనిమిది కిలోల సమోసాలు తయారు చేశాడు. ఆ సమోసా కూడా ప్రజాదరణ పొందింది. దీంతో ఈసారి 12 కిలోల సమోసాను తయారు చేశాడు. తమ షాప్‌నకు వచ్చిన కస్టమర్లు.. వారి పుట్టినరోజు సందర్భంగా కేకు బదులు ఈ బాహుబలి సమోసాను కట్ చేస్తున్నారని తెలిపాడు. అయితే, ఈ 12 కిలోల సమోసాను 30 నిమిషాల్లో తింటే రూ.71,000 గెలుచుకోవచ్చిని ఆఫర్ కూడా పెట్టాడు.
సమోసా తయారీకి 6 గంటలు..
ఈ బాహుబలి సమోసా ఒకటి తయారు చేయడానికి ఆరు గంటల సమయం పడుతుందని కౌశల్ తెలిపాడు. దాన్ని ఫ్రై చేయడానికే గంటన్నర సమయం పడుతుందని చెప్పాడు. 12 కిలోల్లో దాదాపు 7 కిలోల వరకు.. బంగాళ దుంపలు, బఠానీలు, మసాలా, పనీర్, డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంటుందని తెలిపాడు. ఇంత పెద్ద సమోసాను తయారు చేయడానికి దాదాపు 6 గంటల సమయం పడుతుందని చెప్పాడు.
"మా బాహుబలి సమోసా.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, ఫుడ్ బ్లాగర్ల దృష్టిని కూడా ఆకర్షించింది. స్థానికులతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో నివసించే వారు కూడా మా షాప్ గురించి ఆరా తీశారు. ఈ బాహుబలి సమోసా కోసం ముందస్తు ఆర్డర్లు మాత్రమే తీసుకుంటాము. నా సమోసాలకు గుర్తింపు రావడానికి ఏదైనా విభిన్నంగా చేయాలనుకున్నాను. అందులో భాగంగా ఇలా 12 కిలోల సమోసా తయారు చేశాను.'
-- శుభమ్ కౌశల్, బాహుబలి సమోసా రూపకర్త
12 కిలోల 'బాహుబలి' సమోసా ధర దాదాపు రూ.1,500 అని.. ఈ సమోసాల కోసం ఇప్పటివరకు దాదాపు 40 నుంచి 50 ఆర్డర్లు వచ్చాయని కౌశల్ తెలిపాడు. తమ సమోసా దేశంలోనే అతి పెద్దదని కౌశల్ చెప్పాడు.
40 కేజీల బాహుబలి బర్గర్..
Bahubali Burger : ఇలాంటి బాహుబలి పదార్థాలు ఇంతకుముందు కూడా పలువురు చేశారు. అందులో, పంజాబ్‌లోని హోశియార్పుర్కు చెందిన బర్గర్ చాచూ దేశంలోనే అతిపెద్ద బర్గర్ తయారు చేసి రికార్డు సృష్టించాడు. 40 కేజీలకు పైగా బరువున్న బర్గర్‌ను సిద్ధం చేసి వార్తల్లోకెక్కాడు. కొత్తది ఏదైనా చేయాలన్న ఆలోచనతో అతిపెద్ద బర్గర్ రూపొందించినట్లు చెప్పాడు చాచూ. ఈ బర్గర్ కోసం 12కేజీల బన్, కేజీ చీజ్, దాదాపు ఏడు కేజీల కూరగాయలు, సాస్ ఉపయోగించాడు. అప్పట్లో ఈ బాహుబలి బర్గర్‌ను చూసేందుకు స్థానికులు, ఆహార ప్రియులు పోటెత్తారు.