AZADI KA AMRIT: ఆంగ్లేయుల అరాచకత్వం కారణంగా దేశమంతా అల్లకల్లోలంగా తయారైన రోజులవి. వారి కుట్రలకు బలవుతూ ఒక్కో రాజు తమ రాజ్యాలను కోల్పోతున్న కాలమది. అదే క్రమంలో తమిళనాడులోని శివగంగై రాజును వధించి ఆంగ్లేయులు ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. కోట నుంచి తప్పించుకుంటూ... మళ్లీ సగర్వంగా తిరిగొస్తానని శపథం చేసిన రాణి గురించి తెలుసుకుని వారు నవ్వుకున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత అనూహ్యంగా తన మహిళా దళంతో విరుచుకుపడిన ఆమె... ఆంగ్లేయులను ఊచకోత కోసి, రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నారు. తన కరవాలంతో తెల్లదొరల మెడలు తుంచిన ఆ యోధురాలే రాణి వేలు నాచియార్. నాటి వీరత్వానికి చిహ్నంగా 'వీర మంగై'గా ఆమె వినుతికెక్కారు.
Veera mangai velu nachiyar: తమిళనాడులోని రామనాథపురం రాజు చెల్లముత్తు విజయరఘునాథ సేతుపతి, సతవధిముత్తతై దంపతులకు 1730లో వేలు నాచియార్ జన్మించారు. నాటి సమాజ పోకడలను పట్టించుకోకుండా వారు తమ ఏకైక సంతానానికి యుద్ధ విద్యల్లో శిక్షణ ఇప్పించారు. తమిళం, ఆంగ్లం, ఫ్రెంచ్, ఉర్దూ భాషల్లో ప్రవీణురాలిగా తీర్చిదిద్దారు. యుక్తవయసు వచ్చాక శివగంగై రాజు ముత్తువడగనాథ పెరియఉదయ తేవర్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి వేలాచి అనే కుమార్తె పుట్టింది. శివగంగై రాజ్యంపై ఎప్పటి నుంచో కన్నేసిన ఆర్కాట్ నవాబు, ఒంటరిగా విజయం సాధించలేనని గ్రహించి బ్రిటిషర్ల సాయంతో 1772లో యుద్ధం ప్రకటించాడు. ఫిరంగులు, తుపాకులతో ఈస్టిండియా సైనికులు విజయం సాధించి, రాజును వధించారు. కానీ తెల్లదొరల ఎదుట తలవంచడానికి ససేమిరా అన్న వేలు నాచియార్ తన బలగంతో కోట నుంచి చాకచక్యంగా తప్పించుకొని దిండిగల్ అడవుల్లోకి వెళ్లిపోయారు. కోటను విడిచే ముందు తన భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని, మళ్లీ రాజ్యాన్ని కైవసం చేసుకుంటానని శపథం చేసిన నాచియార్ తదనుగుణంగా యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టారు. సుల్తాన్ హైదర్ అలీ సాయం కోరేందుకు స్వయంగా మైసూరు వెళ్లారు. ఆంగ్లేయులను ఓడించాల్సిన అవసరాన్ని ఆయనకు అర్థమయ్యే ఉర్దూలో మాట్లాడి వివరించడంతో హైదర్ అలీ ముగ్ధుడై, అండగా ఉంటానని మాటిచ్చారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఎనిమిదేళ్ల తర్వాత నాచియార్ యుద్ధానికి సిద్ధమవుతారు. విజయదశమి వేడుకల సమయంలో తన మహిళాదళంతో కలిసి ఎవరికీ అనుమానం రాకుండా పూలు, పండ్లు, పూజా సామగ్రి కింద ఆయుధాలను దాచుకుని శివగంగై కోటలోకి ప్రవేశిస్తారు.
దళిత మహిళా కమాండర్ కుయిలీ ఆత్మార్పణం: వేలు నాచియార్ మహిళా దళం కోటలోకి ప్రవేశించిన తర్వాత వారికి కఠినమైన సమస్య ఎదురైంది. అదే తెల్లవారి ఆయుధ డిపో. శత్రు సైనికులు తేరుకునేలోగా దాన్ని నాశనం చేస్తేనే విజయం సాధ్యమవుతుందని గ్రహించిన దళితురాలు, మహిళా దళ కమాండర్ అయిన కుయిలీ... 'మానవబాంబు'గా మారాలనే నిర్ణయం తీసుకుంటుంది. ఒళ్లంతా తేనె, నూనె రాసుకొని బ్రిటిష్ సైనికులను తప్పించుకొని ఆయుధాగారంలోకి ప్రవేశిస్తుంది. తన శరీరానికి నిప్పు అంటించుకుని, మంటలను వ్యాపింపజేయడంతో మొత్తం ఆయుధాలన్నీ ధ్వంసమవుతాయి. వెంటనే నాచియార్ సైన్యం... ఆర్కాట్, బ్రిటిష్ సేనలను ఊచకోత కోస్తుంది. ఊహించని ఈ ఎదురుదాడికి బిత్తరపోయిన బ్రిటిషర్లు లొంగిపోతారు. వేలు నాచియార్ తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని, 1780 నుంచి 1790 వరకు పాలించి, తన కుమార్తెకు రాజ్యం అప్పగించారు. అనంతరం 1796లో ఆమె తుదిశ్వాస విడిచారు. వీరి సాహస గాథ తమిళనాడులో ఇప్పటికీ సజీవంగా ఉంది. స్వాతంత్య్రం వచ్చాక భారత ప్రభుత్వం ఆమె పేరిట తపాళా బిళ్ల విడుదల చేసింది.
ఇదీ చదవండి:
Azadi Ka Amrit Mahotsav: జాతీయ జెండా ఆమోదానికి.. పింగళి కాళ్లు అరిగేలా..