Azadi Ka Amrit Mahotsav: 1907 ఆగస్టు 22.. జర్మనీలోని స్టుట్‌గాట్‌లో అంతర్జాతీయ సామ్యవాద సదస్సు.. కమ్యూనిస్టు యోధుడు లెనిన్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. భారత్ నుంచి దాదాబాయి నౌరోజీ వచ్చారు. అలాంటి సదస్సులో.. నిండు చీరతో.. తలపై ఒకవైపు కొంగు కప్పుకొని కూర్చుంది ఓ యువతి. భారత్ తరఫున బ్రిటిష్ యూనియన్ జెండాను ఎగరవేయటానికి సిద్ధమవుతుంటే.. వ్యతిరేకించిన ఆ యువతి తన సంచిలోంచి చిన్న త్రివర్ణ పతాకాన్ని తీసి ఎగరేశారు. భారత స్వాతంత్య్ర పోరాటానికి మద్దతివ్వాల్సిందిగా సదస్సులోని ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. భారత్‌లో బ్రిటిష్ అకృత్యాలను, భారత స్వాతంత్య్ర ఆవశ్యకతను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకొచ్చారు. ఆమే బికాజీ కామా. అంతా ఆమెను మేడమ్ కామా అని పిలవటం మొదలెట్టారు. అప్పటి 8 రాష్ట్రాలకు ప్రతీకగా ఎనిమిది పువ్వులు, హిందూ ముస్లింల ప్రాతినిధ్యంగా కాషాయం, ఆకుపచ్చ రంగులు, స్వాతంత్య్రం కోసం అమరులవుతున్నవారి చిహ్నంగా ఎరుపు రంగులతో, మధ్యలో వందేమాతరం నినాదంతో.. పతాకాన్ని రూపొందించారు. భారత్‌లో ఇంకా స్వాతంత్య్ర డిమాండ్లే గట్టిగా వినిపించని కాలంలో.. త్రివర్ణ పతాకాన్ని విదేశీగడ్డపై ఎగరేసిన ధీశాలి మేడమ్ కామా.
1861 సెప్టెంబరు 24న బొంబాయిలోని సంపన్న పార్శీ కుటుంబంలో జన్మించారు బికాజీ కామా. ఆ సమయంలో దేశంలోనే అత్యుత్తమ మహిళల విద్యాలయంగా భావించే అలెగ్జాండ్రా సంస్థ నుంచి ఆమె చిన్నతనంలోనే పలుభాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఆస్తిపరులైన రుస్తుం కామాతో వివాహమైంది. భర్త బ్రిటిష్ సర్కారులో పేరున్న న్యాయవాది. భర్తతో పాటు అత్తవారింట అంతా ఆంగ్లేయ సర్కారుకు మద్దతుదారులే. బ్రిటిష్ వల్ల భారత్‌కు మేలు జరుగుతోందని రుస్తుం కామా భావించేవారు. బికాజీ ఇందుకు పూర్తి భిన్నం. ఇద్దరూ భిన్నధ్రువాలయ్యారు. చివరకు బ్రిటిష్‌పై పోరాటం కోసం ఆమె భర్తకు దూరమయ్యారు. 1896లో బొంబాయిలో ప్లేగు మహమ్మారి ప్రబలింది. ధైర్యంగా రంగంలోకి దూకి వ్యాధిగ్రస్తులకు నర్సులా సేవలు చేశారు బికాజీ. ఈ క్రమంలో కొద్దిరోజులకు ఆమె సైతం దాని బారిన పడ్డారు. ప్రాథమిక చికిత్స తర్వాత.. ఆమెను వైద్యులు లండన్‌ను తరలించారు. ఆరోగ్యం మెరుగయ్యాక భారత్‌కు తిరిగి రావటానికి ఆంగ్లేయ సర్కారు షరతులు విధించింది. భారత స్వాతంత్య్రోద్యమానికి, బ్రిటిష్ వ్యతిరేక చర్యలకు దూరంగా ఉండేటట్లయితేనే భారత్‌లో అడుగుపెట్టడానికి అనుమతినిస్తామంది.
ఇందుకు బికాజీ నిరాకరించారు. దీంతో ఆమె ఐరోపాలోనే ప్రవాస జీవితం గడపాల్సి వచ్చింది. లండన్‌లో ఆమెకు విప్లవవాదులు శ్యాంజీ కృష్ణవర్మ, లాలా హర్‌దయాళ్, ఎస్.ఎస్.రాణా, వీర్ సావర్కర్, సేనాపతి బాపత్‌లతో పరిచయమైంది. దాదాబాయి నౌరోజీతో కలసి మేడమ్ కామా విదేశాల్లో భారత స్వాతంత్య్రం కోసం కృషి చేయటం మొదలెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆమెపై లండన్‌లో కట్టడి పెరగ్గా.. పారిస్‌కు మకాం మార్చి.. పారిస్ ఇండియన్ సొసైటీని స్థాపించారు. ఐర్లాండ్, ఈజిప్టు, సోవియట్ విప్లవవాదులతో పాటు ఫ్రాన్స్ సోషలిస్టులతో ఆమెకు సత్సంబంధాలుండేవి. లెనిన్, మాక్సిమ్ గోర్కీలాంటి ప్రముఖులు ఆమెను అభిమానించేవారు. భారత విప్లవవాదులకు ఆర్థికంగా కూడా ఆమె సాయం చేసేవారు. సావర్కర్ జైల్లో ఉండగా ఆయన కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే.. మేడమ్ కామానే వారిని ఆదుకున్నారు.
ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున పాల్గొనటానికి ఐరోపా వచ్చిన భారతీయ సైనికులను కలుసుకొని.. వారిని ఆంగ్లేయులపై తిరుగుబాటుకు ప్రోత్సహించారు మేడమ్ కామా. దీంతో.. బ్రిటన్ ఒత్తిడితో పారిస్‌లోనూ ఆమెపై ఆంక్షలు మొదలయ్యాయి. సోవియట్ యూనియన్‌కు వచ్చి ఉండాలని లెనిన్ ఆహ్వానించారు. కానీ ఆమె అమెరికా పయనమై.. అక్కడి ప్రజలకు భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని వివరించారు.
1935 వరకు అలా ప్రవాసంలోనే గడిపిన కామా ఆరోగ్యం దెబ్బతిని పక్షవాతానికి గురయ్యారు. ఇక ఆమెతో ఎలాంటి ప్రమాదం లేదని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం భారత్‌లో అడుగుపెట్టడానికి అనుమతించింది. జన్మభూమికి తిరిగి వచ్చిన 9నెలల తర్వాత 1936 ఆగస్టు 13న 74వ ఏట ఆ విప్లవమాత కన్నుమూశారు.
ఇదీ చూడండి : 'కఠిన సవాళ్లు వస్తున్నాయ్.. భారత్ మరింత శక్తిమంతం కావాలి'