వారణాసిలోని ప్రతిష్ఠాత్మక బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ)లోకి వెళితే... హైదరాబాద్ కాలనీ అంటూ బోర్డు కనిపిస్తుంది. బీహెచ్‌యూకు హైదరాబాద్‌కు సంబంధమేంటో చూస్తే... దీని పుట్టు పూర్వోత్తరాలేంటో కూడా తెలుస్తాయి. ఒకప్పుడు నలంద, తక్షశిలలాంటి విశ్వ విఖ్యాత విద్యాలయాలకు నెలవైన భారతావనిలో విదేశీయుల దండయాత్రల పుణ్యమా అని అవన్నీ గతించిన చరిత్రగా మిగిలాయి. ఆంగ్లేయులు వచ్చాక.. 20వ శతాబ్ది ఆరంభానికి దేశంలో విశ్వవిద్యాలయాలు ఐదు మాత్రమే. ముంబయి, కోల్‌కతా, మద్రాసు, లాహోర్, అహ్మదాబాద్‌ల్లోని ఇవి ఆంగ్లేయుల అవసరాలకు తగ్గ గుమాస్తాలను తయారు చేయటానికి వీలుగా ఏర్పడ్డవే.
ఈ నేపథ్యంలో... భారతీయ విలువలు, సంస్కృతితో పాటు.. శాస్త్రీయ విజ్ఞానాన్నీ అందించేలా సనాతన, ఆధునిక సమ్మేళనంలా ఉండే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని యోచించారు మదన్ మోహన్ మాలవీయ. 1861 డిసెంబరు 25న ప్రయాగ్‌రాజ్‌లో జన్మించిన ఆయన... కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచీ అందులో సభ్యుడే. న్యాయ పట్టా పుచ్చుకున్న ఆయన 1909లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. సనాతన కుటుంబంలో జన్మించినా... సంస్కరణల బాట పట్టిన ఆయన... మహిళా విద్యకు పెద్దపీట వేశారు. వరకట్నాన్ని వ్యతిరేకించారు. న్యాయవాద వృత్తిని వదిలేసినా, చౌరీచౌరా సంఘటన తర్వాత మళ్లీ నల్లకోటు ధరించి పేద నిందితుల తరఫున వాదించారు. 1906లో హిందూమహాసభను ఆరంభించిన ఆయన దాన్ని కాంగ్రెస్‌లో భాగంగానే 1922లో పునరుద్ధరించారు.
ఆధునిక భారత్‌ను ఆవిష్కరించాలనే తపనతో.. అనిబీసెంట్ వెెంట నిలవగా... 1904లో హిందూ విశ్వవిద్యాలయాన్ని ప్రతిపాదించారు మాలవీయ. 1905 కాంగ్రెస్ సదస్సులో చర్చించారు. లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం బిల్లు పెట్టారు. 1916 ఫిబ్రవరి 4న కల ఆవిష్కారమైంది. అప్పటిదాకా భారత్‌లో ఉన్న విశ్వవిద్యాలయాలంటే కేవలం పరీక్షలు నిర్వహించేవి మాత్రమే. వాటికి భిన్నంగా... గురుకుల రీతిలో... ఆధునిక విద్య బోధించే అధునాతన విశ్వవిద్యాలయంగా బీహెచ్‌యూ వెలసింది. పేరులో హిందూ ఉన్నా... ముస్లిం, సిక్కు, క్రైస్తవ, పార్సీ... ఇలా మతాలకు, కులాలకు అతీతంగా దేశంలోని అందరికీ ప్రవేశం కల్పించారు. అంతా కలిసే వసతి గృహాల్లో ఉండేవారు. అలా ప్రజల వర్సిటీగా మారింది. సంస్కృతం, శాస్త్ర, సాంకేతిక వ్యవసాయం, వైద్యం, ఇంజినీరింగ్, ఆర్థికంలతో పాటు... విదేశీభాషలు, పైలెట్ శిక్షణ కూడా ఆరంభమైందీ విశ్వవిద్యాలయంలో. దేశంలోని అన్ని ప్రాంతాల్లోని నిపుణులకు ఇది వేదికైంది. దేశం కోసం, ప్రజల కోసం పరిశోధనలు సాగాలని మాలవీయ అభిలషించారు. స్వేచ్ఛా వాయువులు పీల్చకుండానే... 1946 నవంబరు 12న ఈ ఆధునిక విద్యావేత్త తుది శ్వాసవిడిచారు. 2014లో ఆయనకు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది.
బీహెచ్‌యూ నిర్మాణానికి మాలవీయ... దేశంలోని ప్రముఖులందరినీ సంప్రదించారు. వారి సాయం, భాగస్వామ్యం కోరారు. ఆ క్రమంలో 1919-20లో నిజాం రాజు ఉస్మాన్ అలీఖాన్‌ను కలిసేందుకు హైదరాబాద్ వచ్చారు. కానీ నిజాం రాజు కోపంతో తన చెప్పులు విసిరేసి... మాలవీయను వెళ్లగొట్టినంత పనిచేశారు. నిజాం చెప్పుల్ని తీసుకొని... హుసేన్ సాగర్ వద్ద వేలానికి పెట్టారు మాలవీయ. ఈ విషయం తెలిసిన నిజాం వెంటనే ఆయన్ను అరెస్టు చేయాలని ఆదేశించారు. 'విరాళమడిగితే మీరు చెప్పులిచ్చారు. వీటితో నేను విశ్వవిశ్వవిద్యాలయం నిర్మించలేను. కాబట్టి... వీటిని అమ్మాలనుకున్నాను. మీ సంస్థానంలోనైతే ఎక్కువ ధర పలుకుతుందని ఇక్కడే అమ్మకానికి పెట్టాను' అంటూ బదులిచ్చారు మాలవీయ. ఇంతలో నిజాం ప్రధాని రంగంలోకి దిగి... మాలవీయ మామూలు మనిషి కాదని... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడనీ... దేశంలో పేరున్న నేత అనీ... ఆంగ్లేయులు సైతం గౌరవించే వ్యక్తనీ వివరించారు. దీంతో... నిజాం రాజు... మనసు మార్చుకొని బీహెచ్‌యూలో వసతి గృహాలు నిర్మించి ఇవ్వటానికి అంగీకరించారు. 1939లో లక్ష రూపాయలు విరాళం కూడా పంపించారు.
ఇదీ చూడండి:- Azadi ka Amrit Mahotsav: ట్రావెన్‌కోర్‌పై నెహ్రూ బాంబు!