రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో మామూలుగా అయితే అరటిపండ్లనో, బజ్జీలనో, ఇడ్లీలనో.. బోర్డులు కనిపించటం, అరుపులు వినిపించటం సహజం! కానీ హిందూ నీళ్లు, ముస్లిం నీళ్లు అని బోర్డులెప్పుడైనా చూశారా? బ్రిటిష్ రాజ్యంలో ఇవి అన్నిచోట్లా కన్పించేవి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలోనే కాదు చివరకు జైలులో ఖైదీలను కూడా ముస్లిం నీళ్లు కావాలా? హిందూ నీళ్లు కావాలా అని అడిగేవారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో మతాలవారీగా విడివిడిగా జగ్గులు, కూజాలు, కుండల్లో నీళ్లను ఉంచేవారు. ఎవరికి కేటాయించిన వాటిలోని నీటిని వారు తాగాలి. అలా నీటివద్ద కూడా హిందూ ముస్లింలను వేరు చేసి తమ పగ్గాలు సుస్థిరం చేసుకున్నారు తెల్లవారు.
ఏమంటే ఏమౌతుందోనని అంతా మౌనంగా ఆ విభజనకే సర్దుకుపోతున్న వేళ.. ఓ ముస్లిం దేశభక్తుడు దీనిపై వ్యతిరేకగళం వినిపించారు. ప్రజలందరినీ సమీకరించి, ఈ వేర్వేరు నీళ్ల పద్ధతిని ఎత్తేసేదాకా పోరాడారు. బ్రిటిష్‌వారిపై విజయం సాధించారు. ఆయన పేరు మౌలానా హబీబ్-ఉర్-రెహ్మాన్ లుధియాన్వి! నీళ్లకు మతమేంటంటూ లుధియానాలోని ఘాస్‌మండీ చౌక్ వద్ద 1929లో నిరసన దీక్ష చేపట్టారు. అప్పటిదాకా మౌనంగా ఉన్న పట్టణ ప్రజలంతా మతాలకు అతీతంగా ఆయన వెనకాల నిలిచారు. హిందూ పానీ, ముస్లిం పానీ వద్దు.. సబ్‌కా పానీ ఏక్ హై (అందరి నీళ్లూ ఒకటే) అంటూ నినదిస్తూ వారంతా ఉద్యమం చేయటంతో.. బ్రిటిష్ ప్రభుత్వం దిగివచ్చింది. కేవలం లుధియానాలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ముస్లింపానీ, హిందూ పానీ పద్ధతిని రద్దు చేసింది.
స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని సుమారు 14 సంవత్సరాల పాటు జైలులోనే గడిపిన మౌలానా హబీబ్ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు సన్నిహితుడు. దేశ విభజనను, ముస్లింలకు ప్రత్యేక దేశంగా పాకిస్థాన్ ఏర్పాటును కూడా హబీబ్ తీవ్రంగా వ్యతిరేకించారు. మహమ్మద్ అలీ జిన్నా ఎన్నిసార్లు తనను పాకిస్థాన్‌కు మద్దతు తెలుపుతూ ప్రకటన ఇవ్వాలని కోరినా దాన్ని తిరస్కరిస్తూ వచ్చారు. దేశ విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రావి నది ఒడ్డున త్రివర్ణపతాకం ఎగరేసి వచ్చారు. అందుకు ఆయన్ను ఏడాది పాటు జైలులో పెట్టారు. దేశ స్వాతంత్య్రం, భవిష్యత్‌పై కీలక నిర్ణయం తీసుకునే సమావేశానికి వెళ్లేముందు- ఎట్టి పరిస్థితుల్లోనూ విభజనకు మద్దతుగా ఓటేయనని నెహ్రూ వద్ద ఒట్టు వేయించుకున్నారు హబీబ్! కానీ తన ఆకాంక్షలకు విరుద్ధంగా దేశ విభజన జరగటంతో కుంగిపోయారు. విభజనానంతరం అనేకమంది నిరాశ్రయులకు మతాలకు అతీతంగా ఆశ్రయం కల్పించారు.
ఇదీ చూడండి: Sabarmati Ashram: స్వరాజ్య సమర స్ఫూర్తి 'సబర్మతి'