Ashpakhulla Khan Biography: అప్పుడా పిల్లాడు ఏడో తరగతి చదువుతున్నాడు. తన పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థి ఒకరిని.. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడంటూ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనే ఆ చిన్నారి మనసులో 'స్వాతంత్య్రం' అనే భావనను మొగ్గతొడిగేలా చేసింది. అదే.. ఆ తర్వాత ఆయనను గొప్ప జాతీయవాదిగా నిలిపింది. భరతమాత దాస్యశృంఖలాలను తెంచేందుకు స్ఫూర్తినిచ్చింది.
అష్పఖుల్లా ఖాన్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌లో 1900 అక్టోబరు 22న అత్యంత సంపన్న కుటుంబంలో జన్మించారు. నవాబుల వంశానికి చెందిన ఆయన కుటుంబం నిత్యం భోగభాగ్యాలతో అలరారేది. ఆ రోజుల్లోనే ఏకంగా 32 పడకగదులు, రెండు ఈతకొలనులు ఉన్న భారీ భవంతిలో నివసించేవారు. సకల సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ చదువులకు పెద్దగా విలువ ఇవ్వలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా డిగ్రీ చదువుకున్నవారు లేరు. తల్లి తరఫు బంధువుల్లో చాలామంది ఆంగ్లేయ ప్రభుత్వంలో ఉన్నతాధికారులు. వీరంతా 1857 ప్రథమ స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా సిపాయిల ఆగ్రహానికి గురయ్యారు. ఈ రెండు కుటుంబాలలో బ్రిటిషర్లపై పోరాటం అటుంచి, కనీసం వారి గురించి వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడినా సహించేవారు కాదు. ఇలాంటి వాతావరణంలో పెరిగినా... అష్పఖుల్లాఖాన్‌కు మాత్రం ఆధునిక భావాలు అలవడ్డాయి. ముఖ్యంగా గొప్ప దేశభక్తుడు రాంప్రసాద్ బిస్మిల్ స్నేహం, బంకిం చంద్ర ఛటర్జీ రాసిన ఆనంద్‌మఠ్ పుస్తకం అతణ్ని పూర్తిగా మార్చేశాయి. తొలిసారి కలిసిననాటి నుంచి చనిపోయే వరకు ఒకే లోకంగా బతికిన బిస్మిల్, అష్పఖ్‌లు ఆ కాలంలో స్నేహానికి మరోపేరుగా నిలిచారు. అన్యమతస్థుడితో దోస్తీ వద్దని కుటుంబసభ్యులు వారిస్తే... స్వాతంత్య్ర పోరాటంలో కులమతాలు ఏమిటని కొట్టిపడేసేవారు. తమ కుటుంబ సభ్యుల ముందే గొంతెత్తి వందేమాతరం నినాదం ఇచ్చేవారు.
ఉరికంబాన్ని ముద్దాడి: బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోసే లక్ష్యంతో ఆయుధాలను సమకూర్చుకోవడానికి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ తరఫున బిస్మిల్ తదితరులతో కలిసి అష్పఖుల్లాఖాన్ 1925 ఆగస్టు 9న కకోరీ సమీపంలో రైలును లూఠీ చేశారు. అప్పుడు అనూహ్యంగా ఒకరి హత్య జరిగింది. కకోరీ కుట్ర కేసుగా ప్రసిద్ధి చెందిన ఈ సంఘటనను బ్రిటిష్ సర్కారు సవాల్‌గా తీసుకుని 42 మందిని అరెస్టు చేసింది. అందులో బిస్మిల్, ఠాకూర్ రోషన్‌సింగ్, రాజేంద్రనాథ్ లాహిరి, అష్పఖుల్లాఖాన్‌లకు ఉరిశిక్ష విధించింది. అప్రూవర్‌గా మారాలని అష్పఖ్‌ను అతని సోదరులు ఎంత వేడుకున్నా ఆయన ఒప్పుకోలేదు. పైగా భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో అత్యంత సంచలనాత్మకమైన ఈ కేసులో ఉరికంబాన్ని ముద్దాడుతున్న ఏకైక ముస్లింగా తన పేరు చిరస్థాయిగా నిలుస్తుందని, తన నిష్క్రమణపై విలపించవద్దని, సగర్వంగా నవ్వాలని వారికి సూచించారు. చివరికి 1927 డిసెంబరు 19న ఆయన తన ప్రియమిత్రులతోపాటు ఉరికంబం ఎక్కారు. భారతమాత సిగలో ఎప్పటికీ వాడిపోని పువ్వుగా నిలిచారు.
ఇదీ చదవండి: భర్త కోసం మంత్రి పదవి త్యాగం చేసిన జెన్నిఫర్!