Atiq Ahmad murder : హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్.. తమను చంపేస్తారని ప్రాణభీతితో చేసిన వ్యాఖ్యలే నిజమయ్యాయి. శనివారం అర్ధరాత్రి.. వీరిద్దరిని దుండగులు అతి సమీపం నుంచి కాల్పి చంపారు. అతీక్ అహ్మద్ కుమారుడు ఈ నెల 13న పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోగా.. తాజాగా అతడ్ని, సోదరుడిని దుండగులు కాల్చి చంపారు. అతీక్ అహ్మద్ అయిదుగురు కుమారుల్లో అసద్ మృతి చెందగా.. మిగతా నలుగురిలో ఇద్దరు కుమారులు జైల్లో ఉన్నారు. మైనర్లయిన ఇద్దరు కుమారులు గృహ నిర్భంధంలో ఉన్నారు. అతీక్, అష్రఫ్ భార్యలు పరారీలో ఉన్నారు.
- 2005లో బీఎస్పీ శాసనసభ్యుడు రాజు పాల్ హత్య కేసులో అతీక్ అహ్మద్ ప్రధాన నిందితుడు.
- 2019 నుంచి సబర్మతి జైల్లో ఉన్నాడు. అతీక్‌పై వందకు పైగా క్రిమినల్ కేసులున్నాయి.
- రాజు పాల్ హత్యకేసులో ముఖ్యసాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్ 2006లో అపహరణకు గురై విడుదల అయ్యాడు. 2007లో అతడు అతీక్, అష్రఫ్‌తోపాటు మరికొందరిపై కిడ్నాప్ కేసు పెట్టాడు.
- కిడ్నాప్ కేసు విచారణ చివరి రోజైన ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేశ్‌పాల్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులోనూ అతీక్ కుటుంబ సభ్యులే ప్రధాన నిందితులు.
ఉమేశ్ పాల్ హత్య కేసు విచారణ నేపథ్యంలో.. బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారని అతీక్ అహ్మద్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే.. అక్కడ చుక్కెదురైంది. అప్పుడు గుజరాత్‌లోని సబర్మతి కేంద్ర కారాగారంలో ఉన్న అతీక్‌ను ఓ కేసు విచారణలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ కోర్టుకు తీసుకువచ్చారు. తొలుత జైలు నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించిన అతీక్‌ను చివరకు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే తనను 2 వారాల్లో జైలు నుంచి బయటకు రప్పించి చంపేస్తానని ఓ సీనియర్ అధికారి బెదిరించినట్లు అష్రఫ్ ఇటీవల ఆరోపించారు. ఒకవేళ తాను హత్యకు గురైతే ఆ అధికారి పేరు ముఖ్యమంత్రికి చేరుతుందన్నారు.
మరోవైపు... అతీక్ నేరసామ్రాజ్యాన్ని కూల్చేస్తున్న యోగి సర్కార్.. ఆర్థిక మూలాలపైనా పెకిలించి వేస్తున్నారు. అతీక్, అతని అనుచరుల అక్రమాస్తుల్లో ఇప్పటివరకు 1400 కోట్ల రూపాయలు విలువైన సంపదను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో 108 కోట్ల రూపాయల నల్లధనాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు గుర్తించారు.
అతీక్ చివరి మాటలు..
హత్యకు ముందు అతీక్.. తన కుమారుడి అంత్యక్రియల గురించి మాడ్లాడాడు. "మీ కొడుకు అసద్ అంత్యక్రియలకు మీరు ఎందుకు వెళ్లలేదు?" అని అతీక్‌ను ఓ జర్నలిస్టు అడిగారు. దానికి అతీక్ "నన్ను పోలీసులు తీసుకువెళ్లలేదు. అందుకే వెళ్లలేదు." అని సమధానమిచ్చారు. ఇవే అతడి చివరి మాటలుగా నిలిచాయి. అనంతరం జర్నలిస్టుల రూపంలో వచ్చిన దుండగులు.. అతీక్‌ను కాల్చి చంపారు.