అసోం అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన 40 మంది అభ్యర్థుల జాబితాలో సగం మంది కొత్తగా ఎన్నికల్లో పోటీచేసేవారే ఉన్నారు. ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. టీటబోర్ సీట్‌కు ఎవరిని నియమించాలన్నదానిపై అసోం దివంగత ముఖ్యమంత్రి తరుణ్ గొగొయి కుటుంబసభ్యులను కాంగ్రెస్ సంప్రదించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. టీటబోర్తో పాటు తిన్‌సుఖియా, దకువాకానా, బహాలీ, ధింగ్, బోకాఖాత్, నవోబయోచా నియోజకవర్గాలకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి తెలిపారు.
మరోవైపు ప్రతిష్ఠాత్మక టీటబోర్ నియోజకవర్గంపై దృష్టిసారించింది భాజపా. మూడు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తరుణ్ గొగొయి ఈ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ప్రాతినిథ్యం వహించారు.
అసోం అసెంబ్లీ ఎన్నికలకు 40మంది అభ్యర్థుల జాబితాను శనివారం రాత్రి ప్రకటించింది కాంగ్రెస్. అసోంలో 2001నుంచి 2016 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. 126 స్థానాలకు గానూ 26 సీట్లకు పరిమితమైంది. ఈ సారి వామపక్షాలు, బోడోలాండ్ పార్టీలతో కలిసి మహా కూటమిగా బరిలోకి దిగుతోంది.
అసోంలో మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి : అసోం, బంగాల్ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా