భారీ వర్షాలు, వరదలకు అసోం వణికిపోతోంది. బ్రహ్మపుత్ర, బరాక్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో 32 జిల్లాలు నీట మునిగాయి. దీంతో బుధవారం ఒక్కరోజే 12 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 55 లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. మృతుల్లో నలుగురు హోజాయ్, బార్పేట్, నల్బారీ జిల్లాలో ముగ్గురు చొప్పున, కంరుప్ జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 101కి చేరింది.
బరాక్ లోయలోని కచార్, కరింగంజ్, హైలకండీ జిల్లాల్లో పరిస్థితులు దుర్భరంగా మారాయి. బరాక్, కుషియారా నదులు ఉగ్రరూపం దాల్చటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మొత్తం 36 జిల్లాలకు గానూ 32 జిల్లాలో వరద ప్రభావం ఉంది. మొత్తం 54,57,601 మంది ప్రభావితమైనట్లు అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.
నగావూన్ జిల్లా, ఫలగురిలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని సందర్శించారు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్. వరద ప్రభావి ప్రాంత ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందని, జరిగిన నష్టంపై అంచనా వేసి ప్రభుత్వ సాయం కోసం నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. మరోవైపు.. నగావూన్ జిల్లాలో ట్రైన్ ద్వారా పర్యటించారు సీఎం హిమంత బిశ్వ శర్మ. పలు వరద ప్రభావి ప్రాంతాల్లో పడవల్లోనూ తిరిగి పరిస్థితులను తెలుసుకున్నారు.
ఇదీ చూడండి: పిడుగుపాటుకు నలుగురు బలి... భీకర వరదలకు 9 మంది...
నదుల ఉగ్రరూపం.. వరదల్లో 55 మంది మృతి..19 లక్షల మందిపై ఎఫెక్ట్