అసోం ఒప్పందాన్ని కాపాడేందుకు సీఏఏ వ్యతిరేక పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ నాయకుడు, దివంగత తరుణ్ గొగొయి తనయుడు గౌరవ్ గొగొయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) తరువాత అసోం సామాజిక, రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అసోంలో సీఏఏకు ముందు.. సీఏఏ తరువాత అన్న పరిస్థితి ఎర్పడిందన్నారు.
" నేను అసోంను సీఏఏకు ముందు.. సీఏఏ తరువాతగా చూస్తాను. సీఏఏను వ్యతిరేకించిన అసోం గణ పరిషత్(ఏజీపీ).. రాజ్యసభలో సీఏఏకు అనుకూలంగా ఓటు వేసింది. సీఏఏ తరువాత కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్పై ప్రజల వైఖరి మారింది. అన్ని పార్టీలు ఒకతాటిపైకి వచ్చి పౌరసత్వ సవరణ చట్టాన్ని, భాజపాను ఓడించాలని ప్రజలు కోరుకుంటున్నారు."
-- గౌరవ్ గొగొయి, కాంగ్రెస్ నేత
'కూటమికి ప్రజల ఆశీర్వాదం'
కాంగ్రెస్-ఏఐయూడీఎఫ్ కూటమికి ప్రజల ఆశీర్వాదం ఉందని భావిస్తున్నట్లు గౌరవ్ చెప్పారు. సీఏఏను వ్యతిరేకించే మరో రెండు పార్టీలు.. రాయ్జోర్ దల్, అసోం జాతీయ పరిషత్.. కూటమిలో ఎందుకు చేరలేదన్న ప్రశ్నకు బదులిచ్చారు. తాము వారిని ఆహ్వానించామని.. కానీ వారు రాలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే సీఏఏను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
'గ్రాఫ్ పెరుగుతోంది'
మహాకూటమిపై స్పందిస్తూ.. ప్రజల్లో తమ గ్రాఫ్ పెరుగుతోందని.. భాజపా గ్రాఫ్ పూర్తిగా పడిపోతుందని స్పష్టం చేశారు గొగొయి. కూటమితో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పరిపాలనను చూసేందుకు ప్రజలు ఆసక్తితో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగం, ధరల పెరుగుదలపై భాజపా స్పష్టమైన పరిష్కారాలు చెప్పటం లేదన్నారు.
అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6న మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి : 'భాజపాతో అభివృద్ధి- కాంగ్రెస్తో అంధకారం'