Arvind Kejriwal ED Case : దిల్లీ మద్యం కేసులో ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థ ఒకవేళ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినా సరే.. దిల్లీ ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగాలని పార్టీ ఎమ్మెల్యేలందరూ కోరినట్లు ఆప్ వెల్లడించింది. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తే జైలు నుంచే పని చేసేలా కోర్టును ఆశ్రయిస్తామని మంత్రి అతీషీ తెలిపారు. దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌కు ఇటీవల ఈడీ నోటీసులు ఇవ్వడం వల్ల ఆయన సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
ప్రధాని మోదీ చేస్తున్న సన్నాహాలతో కేజ్రీవాల్‌తో పాటు మంత్రులమంతా జైలుకు వెళతామని మరో మంత్రి సౌరభ భరద్వాజ్ అన్నారు. ఒకవేళ తాము జైలుకు వెళ్తే అక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. బయట ఉండే మిగతా ఎమ్మెల్యేలు తాము తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తారని తెలిపారు. మద్యం కేసులో ఈనెల 2న విచారణకు రావాలని ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. అయితే ఆ సమన్లు చట్టవిరుద్ధమైనవి, రాజకీయ ప్రేరేపితమైనవి వాటిని వెంటనే ఉహసంహరించుకోవాలని కేజ్రీవాల్ ఈడీకి లేఖ రాశారు. బీజేపీ సూచన మేరకే వాటిని పంపారని ఆరోపించారు.
AAP MLA Arrested in Punjab : మరోవైపు.. పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. మలేర్‌కోట్లా జిల్లాలోని అమర్‌గఢ్‌లో ఆయన ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా.. అక్కడకు వచ్చిన ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. గతేడాది నమోదైన ఓ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే 4 సార్లు సమన్లు పంపినప్పటికీ విచారణకు రాకపోవడం వల్ల అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
లూదియానాలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ గతేడాది జశ్వంత్ సింగ్‌కు చెందిన ఓ కంపెనీపై ఫిర్యాదు చేసింది. ఈ కంపెనీ తమ బ్యాంకుకు రూ. 41 కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ గతేడాది సెప్టెంబరులో.. జశ్వంత్ నివాసంతో పాటు ఆయన కుటుంబం నిర్వహించే స్కూలు, ఆఫీసులు, ఓ ఫ్యాక్టరీలో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ. 16.57 లక్షల నగదు, విదేశీ కరెన్సీ, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ సోదాల ఆధారంగా ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. జశ్వంత్ సింగ్ అరెస్టును ఆప్ అధికార ప్రతినిధి మాల్విందర్ కాంగ్ తీవ్రంగా ఖండించారు. బహిరంగ సభ నుంచి ఆయనను బలవంతంగా కస్టడీలోకి తీసుకోవడం దారుణమని మండిపడ్డారు.
బీజేపీ చెప్తేనే ఈడీ నోటీసులు పంపిందన్న కేజ్రీవాల్, లిక్కర్ స్కామ్ విచారణకు డుమ్మా!
'అంత మంచి వ్యక్తిని జైలులో ఎలా పెట్టారు?'.. సిసోదియాను తలచుకుని కేజ్రీవాల్ ఎమోషనల్