ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన వాటిని ఇచ్చే క్రమంలో ఆలస్యం జరగకుండా చూసేందుకు ప్రతి విభాగం ఓ నోడల్ అధికారిని నియమించుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు అన్నిశాఖలకు లేఖలు రాసింది. ఆయా విభాగలకు చెందిన నోడల్ అధికారుల వివరాలు వెబ్‌సైట్‌లో కనిపించాలని కూడా స్పష్టం చేసింది.
ఇటీవలి కాలంలో ఉద్యోగులు, అధికారులు కరోనా మహమ్మారికి బలైన విషయాన్ని గుర్తు చేసిన కేంద్రం కొన్ని కుటుంబాలకు వారే దిక్కుగా ఉన్నారు కాబట్టి వారు పోయిన తర్వాత ఆయా కుటుంబాలకు అందాల్సిన ప్రయోజనాల విషయంలో ఆలస్యం ఎంత మాత్రం సబబు కాదని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగి ఏ కారణంగా మరణించినప్పటికీ అతడిపై ఆధారపడిన వారికి పదేళ్ల పాటు 50 శాతం నెల వేతనం ఆ తర్వాత 30 శాతం మొత్తాన్ని పింఛన్‌గా ఇస్తున్న విషయాన్ని కూడా కేంద్రం గుర్తు చేసింది.
ఇదీ చూడండి: దీదీ మేనల్లుడికి పార్టీలో కీలక బాధ్యతలు!