Aplastic anemia treatment: వైద్య రంగంలో ప్రస్తుతం అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని వ్యాధులకు సరైన చికిత్స లేదు. అలాంటిదే అప్లాస్టిక్ అనీమియా(ఎముక మజ్జ దెబ్బతినటం). అయితే.. ఈ వ్యాధి బారిన పడిన ఓ రెండున్నరేళ్ల చిన్నారికి హోమియోపతి ద్వారా నయం చేసి చూపించారు వైద్యులు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో జరిగింది.
బిహార్‌లోని మౌలాబాఘ్కు చెందిన నీరజ్ కుమార్ రెండేళ్ల కుమారుడు శివాన్ష్ సింగ్‌కు అప్లాస్టిక్ అనీమియా సోకింది. నడవలేని పరిస్థితికి చేరిన చిన్నారికి వైద్యం అందించేందుకు వారు తిరగని ఆసుపత్రి లేదు. సంప్రదించని వైద్యులు లేరు. ఈ పరిస్థితిలోనే ఇందోర్‌కు చెందిన హోమియో వైద్యుడు డాక్డర్ ఏకే ద్వివేది వారికి ఆశాకిరణంలో కనిపించారు. ఆయనకు గురించి తెలుసుకుని ఫోన్ ద్వారా సంప్రదించి చికిత్సం ప్రారంభించినట్లు నీరజ్ తెలిపారు.
" నా రెండేళ్ల కుమారుడు శివాన్ష్ సింగ్ అప్లాస్టిక్ అనీమియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. చాలా ఆసుపత్రులు, వైద్యులను సంప్రదించాం. కానీ, పరిష్కారం లభించలేదు. దిల్లీలో ఓ స్పెషలిస్ట్ డాక్టర్ వద్ద ఐదు నెలలు చికిత్స అందించాం. కానీ, శివాన్ష్ పరిస్థితి మెరుగుపడలేదు. మాలో నమ్మకం పోయింది. సాయం చేయాలని ముఖ్యమంత్రికి సైతం లేఖ రాశాం. ఇందోర్‌లో ఈ వ్యాధికి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. డాక్టర్ ద్వివేదిని వర్చువల్‌గా కలిసి చికిత్స ప్రారంభించాం. ఆయన సూచించిన మందులు ఉపయోగించాం. కొన్ని పరీక్షలు నిర్వహించి వాటి ప్రకారం వాడాలని సూచించారు. ఆ తర్వాత శివాన్ష్ ఆరోగ్యం మెరుగుపడటం కనిపించింది. డాక్టర్ ద్వివేదికి రుణపడి ఉంటాం."
- నీరజ్ కుమార్, బాలుడి తండ్రి
త్వరలోనే ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుంటాడని, తమకు ఆ నమ్మకం ఉందని డాక్టర్ ద్వివేది తెలిపారు. 'శివాన్షు పరిస్థితిలో మంచి పురోగతి ఉంది. ఔషధాలు సమర్థంగా పని చేస్తున్నాయని తెలుస్తోంది. అతడికి ఇకపై రక్తం మార్చటం లేదా ప్లేట్లెట్స్ ఇవ్వటం అవసరం లేదు. శరీరంలోని వివిధ అవయవాల నుంచి రక్తస్రావం సైతం తగ్గిపోయింది. అతడి వ్యాధి దాదాపుగా తగ్గిపోయిందని చెప్పగలను. కొన్ని రోజుల్లోనే తన స్నేహితులతో కలిసి ఆడుకుంటాడు. భవిష్యత్తులో ఔషధాల అవసరం కూడా రాకపోవచ్చు.' అని పేర్కొన్నారు వైద్యుడు ఏకే ద్వివేది.
అప్లాస్టిక్ అనీమియా అనేది చాలా తీవ్రమైన వ్యాధి అని, ఇది అన్ని వయస్కుల వారికి వస్తుందని తెలిపారు ద్వివేది. 0-20 ఏళ్ల వారిలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ వ్యాధి నేరుగా బాధితుల ఎముక మజ్జను దెబ్బతీస్తుందన్నారు. దీంతో శరీరం కొత్త రక్త కణాలను ఉత్పత్తి చేయటం ఆపేస్తుందని, ఈ పరిస్థితిని మైఎలోడిప్లాస్టిక్ సిండ్రోమ్‌గా పిలుస్తారని చెప్పారు. క్రమంలో శరీరం ఆక్సిజన్ తీసుకోవటం తగ్గిస్తుందని, ప్లేట్లెట్స్ తగ్గిపోయి.. రక్తం మార్పిడికి దారి తీస్తుందన్నారు. ఈ కారణంగా శరీర భాగాల నుంచి రక్తస్రావం అవుతుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పసి బిడ్డను చంపి, మహిళ ఆత్మహత్య.. భర్త మరణవార్త విన్న నిమిషాల్లోనే..