AP High Court Questioned CID Over Margadarsi Case: షేర్ల బదలాయింపు ఆరోపణలతో.. మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ (Margadarsi Chit Funds) ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్‌లపై.. సీఐడీ నమోదు చేసిన కేసు దర్యాప్తును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ.. 8 వారాలు నిలిపేసింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న సీఐడీ, ఫిర్యాదుదారు యూరిరెడ్డికి.. నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను డిసెంబర్ 6కి వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా సీఐడీ తీరుపై.. హైకోర్టు సూటిప్రశ్నలు సంధించింది. కేసు నమోదు విషయంలో సీఐడీ అధికార పరిధిపై.. తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఘటన హైదరాబాద్‌లో జరిగిందని ఫిర్యాదుదారే చెబుతున్నప్పుడు.. కేసు నమోదు చేసే అర్హత, దర్యాప్తు చేసే అధికారం ఏపీ సీఐడీకి ఎక్కడుందని... ఘాటుగా ప్రశ్నించింది. షేర్ల బదిలీ విషయంలో సంతకం చేశానని.. సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులోనే యూరిరెడ్డి పేర్కొన్నారని గుర్తుచేసింది. అలాంటప్పుడు బెదిరించి సంతకం చేయించారనే ప్రశ్నే.. ఉత్పన్నం కాదని పేర్కొంది.
Yuri Reddy Press Conference Against Margadarsi: విలేకరుల సమావేశంలో తడబడిన యూరిరెడ్డి..
ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని.. సీఐడీ నమోదుచేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ 8 వారాలు నిలిపేస్తున్నట్లు.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తన తండ్రి జి.జగన్నాథరెడ్డి నుంచి దఖలు పడిన.. 288 షేర్లను ఫోర్జరీ సంతకాలతో మార్గదర్శి ఎండీకి బదలాయించారనే ఆరోపణతో.. యూరిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. మంగళగిరి సీఐడీ ఠాణా పోలీసులు ఈ నెల 13న మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్‌లపై.. కేసు నమోదు చేశారు. తమపై కేసును కొట్టివేయాలని వారిద్దరూ హైకోర్టులో పిటిషన్లు వేయగా.. పిటిషనర్ల తరఫున.. సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, నాగముత్తు, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.
యూరిరెడ్డి షేర్లు కొనుగోలు చేసినందుకు.. ఆయనకు మార్గదర్శి సంస్థ చెక్కురూపంలో సొమ్ము చెల్లించిందని..ఆ షేర్లను మార్గదర్శి సంస్థకు బదలాయిస్తూ ఫిర్యాదుదారు సంతకం చేశారని వివరించారు. చెక్కును తాను నగదుగా మార్చుకోలేదని, అనుకోకుండా ఖాళీ ఫారంపై సంతకం చేశానని.. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు యూరిరెడ్డి ఫిర్యాదు చేశారని..వివరించారు. ఇప్పటికీ అది పెండింగ్‌లో ఉందన్నారు. ఆరేళ్లు గడిచాక హఠాత్తుగా ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారని.. బెదిరించడంతో సంతకం చేశానని కొత్త ఆరోపణను తెరపైకి తెచ్చారని.. పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు.
వాస్తవానికి గతంలో తమ షేర్లు కొన్నందుకు.. పిటిషనర్ రామోజీరావుకు కృతజ్ఞత తెలుపుతూ 2016 జూన్ 15న ఫిర్యాదుదారు.. ఈ-మెయిల్ పంపారని వివరించారు. మార్గదర్శి సంస్థ హైదరాబాద్‌లో రిజిస్టరైందని.. షేర్ల బదలాయింపు ప్రక్రియ అక్కడే చోటు చేసుకుందని న్యాయవాదులు వివరించారు. ఫిర్యాదుదారు ఆరోపణ ప్రకారం చూసినా.. ఘటన హైదరాబాద్ పరిధిలోనే జరిగిందని.. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అధికార పరిధి సీఐడీకి లేదని.. వాదించారు. ఒకవేళ సీఐడీ కేసు నమోదు చేసినా..తన పరిధిలో లేని అంశం కాబట్టి తెలంగాణకు బదిలీ చేయాలని వాదించారు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌కు షేర్ల బదలాయింపు వ్యవహారంతో సంబంధమే లేదని.. ఆ ప్రక్రియ జరిగినప్పుడు.. ఆమె అక్కడ లేరని వివరించారు.
యూరిరెడ్డి నుంచి కంపెనీకి షేర్ల బదలాయింపు జరిగాక.. చట్ట నిబంధనలను అనుసరించి ఆ షేర్లు శైలజా కిరణ్ పేరుపైకి మార్చారని వివరించారు. ఎఫ్‌ఐఆర్‌లో సైతం.. ఆమెపై ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. ఫిర్యాదు చేయడంలో తీవ్ర జాప్యానికి కారణాలేంటో ఫిర్యాదుదారు పేర్కొనలేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని.. సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తును..నిలువరించాలని కోరారు. సీఐడీ తరఫున శివకల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన 3 రోజుల్లోనే.. దానిని కొట్టేయాలంటూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారన్నారు.
దర్యాప్తు సంస్థకు కనీస సమయం.. ఇవ్వలేదన్నారు. మార్గదర్శి కేసులను ఏపీ సీఐడీ దర్యాప్తు చేస్తున్నందునే ఫిర్యాదుదారువారికి ఫిర్యాదు చేశారన్నారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దన్నారు. న్యాయస్థానాలు యాంత్రికంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని.. సుప్రీంకోర్టు తీర్పులిచ్చిందన్నారు. కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఒకవేళ కేసు తమ పరిధిలోకి రాదని.. సీఐడీ నిర్ధారణకు వస్తే తెలంగాణకు బదిలీ చేస్తామన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై తమకు అవగాహన ఉందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే తాము ఉత్తర్వులిస్తామని తేల్చిచెప్పారు. సీఐడీ నమోదు చేసిన.. ఎఫ్‌ఐఆర్ ఆధారంగా దర్యాప్తు సహా తదుపరి చర్యలన్నింటినీ.. 8 వారాలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.