ఛత్తీస్గఢ్ కోరియా జిల్లా బైకుంత్‌పూర్‌కు చెందిన అనురాగ్ దుబేకు మూగజీవాలపై ఎనలేని ప్రేమ. అనునిత్యం జంతువుల బాగోగుల కోసం పరితపిస్తూ ఉంటాడు. వాటి ఆకలి తీర్చేందుకు సంకల్పించి.. ఆహారాన్ని సేకరించే ప్రత్యేక ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం 'రోటీ వ్యాన్'ను ప్రారంభించాడు.
ఈ రోటీ వ్యాన్ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్లు, హోటళ్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను సేకరించి జంతువులకు అందిస్తున్నాడు దుబే. దీనికి నెలకు కనీసం రూ.25వేలు ఖర్చవుతోందని తెలిపాడు.
''మూగజీవాల సమస్యలను అర్థం చేసుకున్నా కాబట్టే సేవ చేయగలుగుతున్నా. అవి తమ బాధను వ్యక్తపరచలేవు. జంతువులకూ సమస్యలుంటాయని గుర్తించగలిగితే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు.''
-అనురాగ్ దుబే, జంతు ప్రేమికుడు
చిన్నప్పటి నుంచే ఆవులు, పిల్లులు ఇతర జంతువులను తన ఇంట్లో పెంచుకునే అనురాగ్.. రోగాల బారిన పడిన జంతువులకు సపర్యలు చేస్తుంటాడు. ప్రమాదంలో గాయపడిన జంతువులను ఇంటికి తీసుకువచ్చి వైద్యం అందిస్తాడు. ఇప్పటివరకూ ఎన్నో జంతువులకు వైద్య సహాయం అందించి వాటిని ప్రాణాపాయం నుంచి తప్పించాడు.
ఇదీ చదవండి: శునకానికి ఘనంగా సీమంతం