Woman Attacks Nephew: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. తన తల్లి అంత్యక్రియలకు రాలేదని.. సొంత సోదరుడి కుమారుడిపై హత్యాయత్నం చేసింది ఓ మహిళ. కత్తితో దాడి చేసింది. తీవ్రగాయాలపాలైన పదేళ్ల బాలుడు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భోపాల్ హనుమాన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజీ క్యాంప్ సమీపంలో శనివారం జరిగిందీ ఘటన.
ఇదీ జరిగింది: ఖాజీ క్యాంప్ ప్రాంతంలోని.. తన నాన్నమ్మ ఇంట్లోనే ఉంటున్నాడు పదేళ్ల బాలుడు. శనివారం ఆమె చనిపోయింది. ఈ క్రమంలోనే ఝాన్సీలో ఉంటే బాలుడి తల్లిదండ్రులు.. తల్లి అంత్యక్రియల కోసం భోపాల్ రాలేదని కోపం పెంచుకుంది మృతురాలి కూతురు ఆస్మా(40). క్షణికావేశంలో సోదరుడి కుమారుడిపై(అల్లుడు) కత్తితో దాడి చేసింది. నిందితురాలిపై హత్యాయత్నం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
తండ్రిని చంపిన తనయుడు: మహారాష్ట్రలో దారుణం జరిగింది. 70 ఏళ్ల వయసున్న తండ్రిని హత్య చేశాడు 40 ఏళ్ల ఓ వ్యక్తి. నిందితుడు మానసిక వికలాంగుడు అని తెలిపారు పోలీసులు. పాల్ఘర్లోని మోఖ్డా వద్ద శనివారం జరిగిందీ ఘటన. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదు.
పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య?: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తమ ఫ్లాట్‌లో విగతజీవులుగా కనిపించారు. దిల్లీ వసంత్ విహార్ ప్రాంతంలో శనివారం సాయంత్రం వెలుగులోకి వచ్చిందీ ఘటన. మృతులను మంజు, ఆమె కుమార్తెలు.. అన్షికా, అంకుగా గుర్తించారు. ఫ్లాట్ నెం. 207 లోపలి నుంచి లాక్ వేసుందని, ఎవరూ స్పందించట్లేదని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలుకొట్టి లోపలకు వెళ్లగా ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. స్వల్పంగా గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తించారు పోలీసులు. అక్కడే సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది.
గతేడాది ఏప్రిల్‌లో మృతురాలి భర్త కరోనా వైరస్‌కు బలయ్యాడు. ఆ బాధలో మంజు కూడా అనారోగ్యం కారణంగా కొద్దిరోజులకే మంచానికే పరిమితమైంది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
కోడిపై కేసు: మధ్యప్రదేశ్ సీహోర్‌లోని ఆష్ఠా పోలీస్ స్టేషన్లో వింత కేసు నమోదైంది. ఓ పెంపుడు కోడి దాడి చేయగా.. ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయని బాధితులు ఫిర్యాదు చేశారు. తొలుత ఆశ్చర్యపోయిన పోలీసులు.. తర్వాత కోడిపై పలు సెక్షన్ల కింద నమోదు చేయడం గమనార్హం. కోడిని స్టేషన్‌కు తీసుకురావాలని యజమానికి స్పష్టం చేశారు. తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. భగీరథ్ కుష్వాహా ఇంటికి పొరుగింట్లోని ప్రకాశ్ మెహ్తర్కు చెందిన కోడి వచ్చింది. ఆ సమయంలో భగీరథ్ తమ్ముడు, మేనల్లుడిపై దాడి చేసి గాయపరిచిందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవీ చూడండి: 22 లక్షల విలువైన మద్యం సీసాలు.. రోడ్డు రోలర్‌తో తొక్కించారు..!
మందుకొట్టి అమ్మాయిల రచ్చ.. రేంజ్ రోవర్‌తో ఢీ.. ఒకరు మృతి.. ఎస్సైపైనా దాడి!