కేంద్ర మాజీ మంత్రి, సోషలిస్ట్ నేత, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ మృతదేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి సహా మరికొంత మంది ప్రముఖులు.. శుక్రవారం దిల్లీలోని ఆయన నివాసంలో శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం శరద్ యాదవ్ సేవలను గుర్తు చేసుకున్నారు. "శరద్ యాదవ్ మృతి.. దేశానికి తీరని లోటు. గత ఐదు దశాబ్దాలుగా శరద్ యాదవ్ ప్రజల సమస్యలే లక్ష్యంగా పనిచేశారు. తన చివరి శ్వాస వరకు సోషలిస్ట్ భావాలను ప్రోత్సహించారు" అని అమిత్‌షా కొనియాడారు.
ప్రస్తుతం పంజాబ్‌లో భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్.. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో శరద్ యాదవ్ నివాసానికి వెళ్లారు. ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. శరద్ యాదవ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్లు రాహుల్ వెల్లడించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. "మా నానమ్మ(ఇందిరా గాంధీ), శరద్ యాదవ్ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ.. వారెప్పుడూ పరస్పరం గౌరవించుకునేవారు." అని రాహుల్ గాంధీ తెలిపారు. రబ్రీ దేవి సైతం శరద్ యాదవ్ నివాసానికి వెళ్లి, ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు.
శరద్ యాదవ్ మృతి నేపథ్యంలో బిహార్ ప్రభుత్వం శుక్రవారం సంతాప దినం పాటించింది. "శరద్ యాదవ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన మరణించారన్న వార్త దిగ్భ్రాంతి కలిగించింది. సామాజిక, రాజకీయ రంగాలకు శరద్ యాదవ్ మరణం తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి" అంటూ విచారం వ్యక్తం చేశారు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్.
శరద్ యాదవ్‌కు నివాళులు అర్పించిన వారిలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎంపీ రమేష్ బిధూరి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భార్య సావిత్రి సింగ్, హరియాణా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్, ఆర్జేడీ మనోజ్ ఝా తదితరులు ఉన్నారు.
గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ యాదవ్.. గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శరద్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన మధ్యప్రదేశ్, హోషంగాబాద్ జిల్లాలోని అంఖ్‌మౌలో జరగనున్నాయి. శనివారం ఈ కార్యక్రమం జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శరద్ యాదవ్‌కు భార్య ఓ కొడుకు, కూతురు ఉన్నారు.