jammu kashmir news: జమ్ముకశ్మీర్‌లో విద్యుత్ సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. ఫలితంగా చాలా ప్రాంతాలు ఆంధకారంలోకి జారుకున్నాయి. దీంతో అత్యవసర సేవలను తిరిగి పునరుద్ధరించేందుకు స్థానిక అధికార యంత్రాంగం సైన్యం సాయం కోరింది.
ఉద్యోగుల సమ్మె కారణంగా జమ్ము ప్రాంతంలో విద్యుత్ సేవలపై తీవ్ర ప్రభావం పడిందని.. ఆర్మీలోని జమ్ము డివిజన్ కమిషనర్ రాఘవ్ లాంఘర్ తెలిపారు. ఈ కారణంగా ప్రధాన విద్యుత్ స్టేషన్లలో, నీటి సరఫరాకు సరిపడా సిబ్బంది లేరు. దీంతో అవసరమైన సేవలను పునరుద్ధరించడానికి సైన్యం సాయం చేయాల్సిందిగా కోరుతున్నాని లాంఘర్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆర్మీ అధికారులు నీటి సరఫరా, విద్యుత్ స్టేషన్లలో షిప్ట్‌ల ప్రకారం సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకుగానూ బలగాలు రంగంలోకి దిగినట్లు స్పష్టం చేశారు.
ఇటీవల పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జమ్ము, కశ్మీర్ పవర్ ట్రాన్సిమిషన్ కార్పొరేషన్‌ను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా దీనిని ఓ ప్రైవేటుకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వ తీరుకు నిరసనగా దాదాపు 20 వేల మంది విద్యుత్ ఉద్యోగులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం సహా రోజువారీ వేతన ప్రాతిపదికన పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే జరిగిన రెండు రౌండ్ల చర్చలు విఫలమైనందున లైన్మెన్ల నుంచి సీనియర్ ఇంజనీర్ల వరకు అందరూ నిరవధిక సమ్మె ప్రారంభించారు. దీంతో జమ్ము, కశ్మీర్‌లోని అనేక ప్రాంతాలలో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.
సుమారు 50 శాతానికి పైగా జమ్ము కశ్మీర్ ప్రాంతమంతా అంధకారంలో ఉండిపోయింది.
ఇదీ చూడండి: Militants Firing: రెచ్చిపోయిన ఉగ్రమూక- పోలీస్‌పై కాల్పులు