ఇక్కడ కనిపిస్తున్న పెయింటింగ్స్ అన్నీ దుకాణాల నుంచి కొనుగోలు చేసినవి కాదు. వీటన్నింటినీ ఓ దివ్యాంగురాలు తీర్చిదిద్దింది. నమ్మశక్యంగా అనిపించకపోయినా ఇది నిజం. మస్కులర్ డైస్ట్రోఫీ డిసీజ్ అనే ఓ ఎముకల వ్యాధి కారణంగా ఈ అమ్మాయి కనీసం నిల్చోలేదు. మంచానికే పరిమితమైపోయింది. కానీ, ఈ పరిస్థితులేవీ ఆమె ప్రతిభకు అడ్డుగా మారలేదు. ఔరా అనిపించే ఎన్నో అందమైన చిత్రాలను చేత్తో గీసింది మీనా. కర్ణాటక, శివమొగ్గ జిల్లాలోని హోసల్లాయికి చెందిన మీనా.. తన చిత్రాలతో దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
"చదువంటే ఇష్టం. దానితోపాటు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌పైనా మక్కువ పెంచుకున్నాను. ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేసిన తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌నే అభిరుచిగా మలచుకున్నా. పీయూ కళాశాల మా ఇంటి నుంచి చాలా దూరం. నా స్నేహితుల సూచనల మేరకు, పూర్తిస్థాయి వ్యాపకంగా ఆర్ట్‌ను ఎంచుకున్నా. ముంబయి వేదికగా ఉన్న ఓ సంస్థలో ఏడాది పాటు ఆన్‌లైన్ కోర్సు కూడా నేర్చుకున్నా."
- మీనా, కళాకారిణి
అదే ఆమె ఉద్యోగంగా..
పెయింటింగ్‌నే ఉద్యోగంగా మలచుకుంది మీనా. ఆరోగ్యం బాగాలేకపోయినా తన అభిరుచిని దూరం పెట్టలేదు. ప్రస్తుతం కళ ఆమె జీవితంలో ప్రధాన భాగంగా మారిపోయింది. ముంబయిలోని ఓ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంస్థ నుంచి ఆన్‌లైన్ వేదికగా హోమ్ డెకరేషన్ కోర్సు పూర్తిచేసింది.
"మీనా ప్రతిభ చూసి మేమే ఆశ్చర్యపోయాం. ఇదంతా తనే స్వయంగా నేర్చుకుంది. అందరూ తనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఆర్ట్‌వర్క్‌లో మీనా ఎదుగుదల చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నేను పెద్దగా సాయమేమీ చేయట్లేదు. కానీ, కాగితాలు కత్తిరించి ఇవ్వడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తున్నా. ఆమె శ్రమ వల్లే ఈ స్థాయికి వచ్చింది."
- జ్యోతి, మీనా తల్లి
ఇదీ చదవండి: ఔరా: సుద్దముక్క, పెన్సిల్ నిబ్‌పై గణేశుడు
పలు కళాఖండాలు..
మీనా ఇప్పటివరకూ సుఫాసూ ఆర్ట్‌వర్క్, డుకూ పేజ్, మిక్స్‌డ్ మీడియా, ఎండీఎఫ్, ప్యాట్ సెరామిక్ గ్లాస్ లాంటి వివిధ రకాల క్రాఫ్ట్ వర్క్‌లు చేసింది. సెరామిక్ గ్లాస్ టెక్నిక్‌తో ఇంటి అలంకరణ చేసే కళను నేర్చుకుంది మీనా. ఫర్నిచర్‌పైనా ఆర్ట్‌వర్క్ చేసి, అందంగా తీర్చిదిద్దగలదు ఈ కళాకారిణి.
"ఆమె చేసే ఆర్ట్‌వర్క్ గురించి వివరించాలంటే ఒకరోజు పడుతుంది. వివిధ రకాల కళాఖండాలు తయారుచేసింది. చాలా ఏళ్లుగా ఈ పని చేస్తోంది. చాలామంది మహిళలు, యువతులకు మీనా ఆదర్శం."
-నిరంజిని, మీనా స్నేహితురాలు
విదేశాల్లోనూ గుర్తింపు..
కీ హోల్డర్లు, ఫొటో ఫ్రేములు, వాల్ హ్యాంగింగ్స్, కీ బంచ్ హ్యాంగర్స్, వాచ్ బాక్సులు, నీళ్ల సీసాలు.. ఇలాంటి వాటిని అందంగా తీర్చిదిద్దుతుంది మీనా. మొదట్లో ఒంటరిగా చేసినా.. ప్రస్తుతం స్నేహితులకూ నేర్పించి, వాళ్లతో కలిసి ఈ పనులు చేస్తోంది. తన పెయింటింగ్స్‌ను విదేశాలకూ విక్రయిస్తోంది. వైకల్యాన్ని ఎదుర్కుని, ఆర్ట్‌వర్క్‌ను ఓ సవాలుగా స్వీకరించి, పట్టుదలతో ఆ కళపై పట్టు సాధించింది మీనా. తనలాంటి యువతులకే కాదు.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.
ఇదీ చదవండి: మూడేళ్లకే 163 దేశాల పేర్లు ఇట్టే చెప్పేస్తోంది