Alumni Renovates 135 Year Old School : 135 ఏళ్ల చరిత్ర కలిగిన తమ పాఠశాలను పూర్వవిద్యార్థులంతా కలిసి బాగు చేయించారు. రూ.కోటికి పైగా చందాలు వేసుకొని స్కూల్‌ను పునర్నిర్మించారు. కర్ణాటకలోని హవేరీ జిల్లాలో జరిగిందీ ఘటన.
బ్యాడగి తాలుకాలోని కదరముందలగి గ్రామంలో ఉంది ఈ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్. దీనికి 135 ఏళ్ల చరిత్ర ఉంది. భవనం పాతబడి కూలిపోయే స్థితికి చేరుకుంది. వర్షాలు పడితే ఎక్కడికక్కడ నీరు లీక్ అయ్యేది. దీంతో ఇక్కడ చదివే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇక్కడ చదువుకునే విద్యార్థులు, చదువు చెప్పే టీచర్లు సైతం.. భవనంలో కాకుండా బయట చెట్టుదగ్గర కూర్చోవడం మొదలుపెట్టారు.
అయితే, ఈ స్కూల్ పరిస్థితి గురించి ఇక్కడ చదువుకొని వివిధ రంగాల్లో స్థిరపడిన విద్యార్థులకు తెలిసింది. గత 20-30 ఏళ్లలో ఇక్కడ చదువుకున్న వారంతా కలిసి.. స్కూల్‌ను బాగు చేయాలని ప్రజాప్రతినిధులను కోరారు. అయినా ప్రయోజనం లేకపోవడం వల్ల.. తామే బడిని బాగు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పూర్వవిద్యార్థుల అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని.. డబ్బు సేకరించడం మొదలుపెట్టారు. విద్యాశాఖ, అటవీశాఖ, ఆర్టీఓ సహా వివిధ ఉద్యోగాల్లో స్థిరపడినవారంతా తోచినంత విరాళం ఇచ్చారు.
రూ.కోటి దాటిన విరాళాలు
మొత్తంగా 500 మందికి పైగా పూర్వవిద్యార్థులు విరాళాలు ఇవ్వగా.. రూ.కోటి 18 లక్షలు పోగయ్యాయి. 2019లో స్కూల్ పునర్నిర్మాణ పనులు ప్రారంభం కాగా.. ఎట్టకేలకు రెనోవేషన్ పూర్తైంది. ఈ నెల 29న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతులమీదుగా స్కూల్ కొత్త భవనాన్ని ప్రారంభించనున్నారు.
"135 ఏళ్ల నుంచి ఈ స్కూల్ నడుస్తోంది. భవనం పాతబడటం వల్ల స్కూల్‌కు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ స్కూల్‌కు పంపించేందుకు వెనకడుగు వేశారు. భవనాన్ని బాగు చేయించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నాం. కానీ ఎవరూ స్పందించలేదు. అందుకే, మేమే స్వయంగా చందాలు వేసుకొని స్కూల్‌ను బాగు చేయించాం. రూ.వెయ్యి నుంచి రూ.10 లక్షల వరకు విరాళాలు ఇచ్చారు."
-కాంతేశ్ నాయకర్, పూర్వవిద్యార్థి
ప్రస్తుతం ఈ స్కూల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులను సైతం ప్రారంభించారు. ఈ తరగతులకు అయ్యే రూ.18వేలు నెలవారీ ఖర్చును సైతం తామే భరిస్తామని పూర్వవిద్యార్థులు ప్రకటించారు. స్కూల్‌ను బాగు చేయించిన పూర్వవిద్యార్థుల సంఘంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రతిసారి ప్రభుత్వంపై భారం వేయకుండా.. ప్రజలు సైతం తమ వంతు కృషి చేస్తే అనేక సమస్యలు పరిష్కారమవుతాయని పూర్వవిద్యార్థులు చెబుతున్నారు.