దేశంలో మహిళల గర్భ విచ్ఛిత్తి హక్కులపై సుప్రీంకోర్టు గురువారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. సురక్షితంగా, చట్టపరంగా 20 నుంచి 24 వారాల్లోపు గర్భస్రావం చేయించుకునే హక్కు మహిళలందరికీ ఉందని స్పష్టం చేసింది. ఇందులో వివాహితులు, అవివాహితులనే వివక్ష చూపడం రాజ్యాంగంలోని అధికరణం 14కు పూర్తి విరుద్ధమని పేర్కొంది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం కింద అవివాహిత మహిళలకూ 20 నుంచి 24 వారాల్లో గర్భవిచ్ఛిత్తి చేసుకునే అధికారం ఉందని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా.జస్టిస్ ఎ.ఎస్.బోపన్నల ధర్మాసనం వెల్లడించింది. అంతేకాదు.. ఎంటీపీ చట్టంలోని సెక్షన్ 3(బి)ఎ పరిధిలోకి తొలిసారి వైవాహిక అత్యాచారాన్ని తీసుకొచ్చింది.
సమ్మతి లేకుండా బలవంతంగా భర్త చేసిన సంభోగం కూడా అత్యాచారం కిందకే వస్తుందని, దీని ద్వారా వచ్చిన గర్భాన్ని తొలగించుకొనే సంపూర్ణహక్కు భార్యకు ఉంటుందని తేల్చి చెప్పింది. ఎంటీపీ చట్టం ప్రకారం.. వివాహితులు, అత్యాచార బాధితులు, దివ్యాంగులు, మైనర్లు.. ఇలా ఏడు వర్గాల మహిళలు 24 వారాల్లో గర్భవిచ్ఛిత్తి చేసుకోవచ్చు. వితంతువులు, అవివాహితులకు ఈ గడువు 20 వారాలే. దీన్ని ధర్మాసనం తన తీర్పులో 20 నుంచి 24 వారాలకు పెంచింది. "అవివాహిత మహిళ సురక్షిత గర్భస్రావ హక్కును తిరస్కరించడమంటే, రాజ్యాంగంలోని అధికరణం 21 ప్రకారం ఆమె స్వేచ్ఛను హరించడమే" అని ధర్మాసనం వివరించింది.
ఈ సందర్భంగా లైంగిక కార్యకలాపాల్లో కేవలం వివాహిత మహిళలే చురుగ్గా పాల్గొంటారన్న మూస ఆలోచనలు సరికావని వ్యాఖ్యానించింది. సంతానాన్ని కనాలా లేదా అనే విషయంలో వివాహిత మహిళలకు ఉండే స్వేచ్ఛే అవివాహిత స్త్రీలకూ ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. "ప్రతి మహిళకు తన శరీరంపై సంపూర్ణ హక్కు ఉంటుంది. గర్భస్రావం చేసుకోవాలా లేదా అన్న విషయంపై నిర్ణయం తీసుకొనే అధికారం కూడా అంతిమంగా ఆమెకే వదిలేయాలి" అని ధర్మాసనం పేర్కొంది.ట్రాన్స్‌జెండర్ మహిళల అంశాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. వారి గర్భస్రావాల విషయంలోనూ వైద్యపరంగా సురక్షిత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
ప్రమాదకరంగా 45% అబార్షన్లు
ప్రపంచవ్యాప్తంగా ఏటా 45% అబార్షన్లు ప్రమాదకర రీతిలో జరుగుతున్నట్లు ఓ అంచనా. సరైన సమయంలో, సురక్షిత ప్రదేశంలో, సుశిక్షితులు చేయకపోవటం వల్ల ఇవి చాలా సందర్భాల్లో మరణాలకు దారితీస్తున్నాయి. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు నేపథ్యంలో- గర్భవిచ్ఛిత్తికి సంబంధించి పలు అధ్యయనాల్లో తేలిన ఆసక్తికర విషయాలను పరిశీలిస్తే.. .
- ఏటా ప్రపంచవ్యాప్తంగా 7.3 కోట్ల ఉద్దేశపూర్వక అబార్షన్లు జరుగుతున్నాయి.
- 97 శాతం అబార్షన్లు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే చోటుచేసుకుంటున్నాయి.
- అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గర్భవిచ్ఛిత్తి తర్వాత తలెత్తే సమస్యలకు చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఏటా 70 లక్షలకుపైగా ఉంటోంది.
- అబార్షన్లకు అనుమతి అన్ని దేశాల్లో ఒకేలా లేదు. ప్రపంచంలో 42 దేశాలు... గర్భిణి ప్రాణం రక్షించే క్రమంలో అబార్షన్‌కు అనుమతిస్తున్నాయి.
- మరో 50 దేశాలు ఆరోగ్య కారణాలతో గర్భవిచ్ఛిత్తికి అంగీకరిస్తున్నాయి.
- మహిళల ఆర్థిక, సామాజిక పరిస్థితుల ఆధారంగా బేరీజు వేసి... పుట్టిన పిల్లలను తల్లి సాకలేరని నిర్ధారణకు వస్తే అబార్షన్‌కు అనుమతించే దేశాలు 13.
- 75 దేశాలు విజ్ఞప్తి చేసినంతనే అబార్షన్‌కు ఓకే చెప్పేస్తున్నాయి.
- 24 దేశాలు మాత్రం అబార్షన్‌ను పూర్తిగా నిషేధించాయి. అమెరికా సుప్రీంకోర్టు ఇటీవలే తమ దేశంలో అబార్షన్‌లు హక్కు కాదని తీర్పునిచ్చింది. ఎల్‌సాల్వడార్‌లాంటి చోట్ల గర్భస్రావం చేయించిన మహిళలను జైల్లో పెట్టి శిక్షిస్తున్నారు.
ఇదీ చదవండి:
కోతులను చెట్టుకు వేలాడదీసిన దుండగులు.. రెండు వానరాలు మృతి
ఆ 67 అశ్లీల వెబ్‌సైట్‌లపై కేంద్రం కొరడా.. వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశాలు