ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై తాను మూత్రవిసర్జన చేయలేదంటూ నిందితుడు శంకర్ మిశ్రా గురువారం కోర్టులో వినిపించిన వాదనల్ని బాధితురాలు తీవ్రంగా ఖండించింది. ఈ తప్పుడు ఆరోపణలతో తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎదుర్కొన్న ఈ చేదు అనుభవాన్ని మరొకరికి ఎదురవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ఉద్దేశంతోనే ఈ ఫిర్యాదు చేశానని శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.
"నిందితుడు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. అవన్నీ కల్పితాలే. ఆ వ్యక్తి తన బెయిల్ దరఖాస్తులో పేర్కొన్న విషయాలు.. కోర్టులో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. నేను అనుభవించిన ఇలాంటి భయానక అనుభవం మరొకరికి ఎదురవ్వకుండా సంస్థాగత మార్పులు చేపడతారనే ఉద్దేశంతోనే నేను ఈ ఫిర్యాదు చేశాను. ఆ వ్యక్తి తన అసహ్యకరమైన చర్యకు పశ్చాత్తాపం చెందాల్సింది పోయి.. నన్ను మరింత వేధించాలనే ఉద్దేశంతోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. అబద్ధాలను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు"
-- బాధితురాలు
శుక్రవారం దిల్లీలోని సెషన్స్ కోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్న నిందితుడు బాధితురాలిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. 'నేను ఆ మహిళపై మూత్రవిసర్జనకు పాల్పడలేదని.. బహుశా ఆమెనే అలా చేసుకుని ఉంటుంది. ఆమె కథక్ నృత్యకారిణి.. 80 శాతం కథక్ నృత్యకారుల్లో మూత్ర విసర్జనపై నియంత్రణ ఉండదు' అని వాదించాడు.
గతేడాది నవంబరు 26న న్యూయార్క్ నుంచి దిల్లీ వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో గతవారం శంకర్ మిశ్రాను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతడిని పోలీసు కస్టడీకి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిరాకరించింది. దీంతో పోలీసులు సెషన్స్ కోర్టులో అప్పీలు చేశారు. ఈ అప్పీల్‌పై కోర్టు నోటీసులు జారీ చేయగా.. నిందితుడు తన వాదనని న్యాయస్థానానికి వినిపించాడు. ఈ సమయంలో సదరు మహిళ ప్రొస్టేట్ సంబంధిత సమస్యలతో బాధపడుతోందని, అందువల్ల ఆవిడే మూత్రవిసర్జన చేసుకుని ఉంటుందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. అయితే అంతకుముందు ఈ వ్యవహారంలో తాను బాధితురాలికి నష్టపరిహారం ఇచ్చానని అంగీకరించిన శంకర్ మిశ్రా.. తాజాగా కోర్టులో తన వాదనను మార్చడం గమనార్హం.
ఇవీ చదవండి: