AI Passenger Urinating Case : ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన ఘటనలో ఆ సంస్థకు జరిమానా విధించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ). నిబంధనలు ఉల్లఘించినందుకు రూ. 30 లక్షలు సంస్థకు ఫైన్ వేసింది. విమాన పైలెట్ లైసెన్స్‌ను 3 నెలల పాటు సస్పెండ్ చేసింది. తన విధులు సరిగ్గా నిర్వర్తించనందుకు గాను ఎయిర్ ఇండియా ఇన్‌ఫ్లైట్ సర్వీసెస్ డైరెక్టర్‌కు రూ.3లక్షల ఫైన్ వేసింది డీజీసీఏ.
మరోవైపు ఈ ఘటనలో నిందితుడు శంకర్ మిశ్రాను నాలుగు నెలల పాటు విమానంలో ప్రయాణించకుండా నిషేధం విధించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. అయితే.. డీజీసీఏ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అతడి న్యాయవాదులు తప్పుబట్టారు. అంతర్గత విచారణ కమిటీని తాము గౌరవిస్తామని.. కానీ ఆ కమిటీ సూచించిన కారణాలతో తాము విభేదిస్తామన్నారు. 9Aలో కూర్చున్న వ్యక్తి 9Cలో కూర్చున్న ప్రయాణికురాలిపై ఎలా మూత్ర విసర్జన చేశాడన్న దానిపై కమిటీ సరైన వివరణ ఇవ్వలేదని చెప్పారు. కమిటీ నిర్ణయంపై తాము అప్పీల్ చేశామని.. తమకు దేశ న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు.
గతేడాది నవంబరు 26న న్యూయార్క్ నుంచి దిల్లీ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం బిజినెస్ క్లాసులో మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. అజ్ఞాతంలో ఉన్న నిందితుడు శంకర్ మిశ్రాను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కేసులో విచారణ నిమిత్తం అతడిని మూడు రోజుల కస్టడీకి అప్పగించాలని దిల్లీ పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పగించేందుకు ఒప్పుకోలేదు. అనంతరం అతడిని 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించింది.
టాటా గ్రూప్ ఛైర్మన్ విచారం
మూత్ర విసర్జన ఘటనపై టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తమ ఉద్యోగులు త్వరితగతిన స్పందించాల్సిందని తెలిపారు. దీనికి వారు సరైన రీతిలో పరిష్కారం చూపించలేదని అభిప్రాయపడ్డారు. తనతో పాటు సంస్థ ఉద్యోగులకు ఎంతో వేదనను కలిగించిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతకు టాటా గ్రూప్, ఎయిర్ ఇండియా సంస్థలు ప్రాధాన్యం ఇస్తాయని.. తమ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తారని ఆయన వివరించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇవీ చదవండి: స్వాతిని ఈడ్చుకెళ్లిన కారు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
బ్యాంకు దోపిడీకి వచ్చిన ముగ్గురికి చుక్కలు చూపించిన మహిళా పోలీసులు