శస్త్రచికిత్సలు చేయడానికి ఆయుర్వేద వైద్యులకూ అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దేశావ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు చేపట్టారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అత్యవసర, కొవిడ్ కేసులు మినహా ఇతర కేసుల్లో సేవలు అందించకూడదని వైద్యులకు పిలుపునిచ్చింది భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ). కేంద్రం నిర్ణయాన్ని ఆధునిక వైద్య శాస్త్రంపై దాడిగా అభివర్ణించిన ఐఎంఏ... ఆ నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరింది.


దిల్లీలో ఎయిమ్స్, లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి(ఎల్ఎన్జేపీ), రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, డీడీయూ ఆసుపత్రులతో పాటు మరికొన్ని ఆసుపత్రుల్లో వైద్యులు ఆందోళనకారులకు సంఘీభావంగా నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు.



అసోం, కేరళలో ఆందోళనలు..
అసోంలోని ఐఎంఏ సభ్యులూ ఆందోళనకు మద్దతు తెలిపారు. ఆయుర్వేద వైద్యుల శస్త్రచికిత్సలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఆయుర్వేద వైద్యానికి ప్రసిద్ధి అయిన కేరళలోనూ ఈ ఆందోళనల్లో వైద్యులు మద్దతుగా నిలిచారు. ఆసుపత్రుల ముందు బైఠాయించి నిరసనల్లో పాల్గొన్నారు.
ఆయుర్వేదంలోని పలు విభాగాల్లో పీజీ చేసిన విద్యార్థులకు శస్త్రచికిత్సల నిర్వహణ కోసం శిక్షణ ఇచ్చేందుకు అనుమతించింది కేంద్రం. ఈ మేరకు ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ నిబంధనలు సవరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అపాయం లేని కణతుల తొలగింపు, ముక్కు, కంటి శుక్లాల నిర్మూలన వంటి శస్త్రచికిత్సలకు శిక్షణ అందించేందుకు అనుమతించే విధంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇదీ చూడండి: ఆయుర్వేద పట్టభద్రులూ శస్త్రచికిత్సలు చేయొచ్చు