దేశంలో ప్రత్యేక రాష్ట్రాల అంశం మరోసారి తెరపైకి వస్తున్నట్లు కనిపిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పడబోతున్నాయంటూ ఓ కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక రెండు రాష్ట్రాలుగా విడిపోతుందన్న ఆయన.. ఈ విషయంపై ప్రధానమంత్రి ఆలోచిస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. ప్రధాని మోదీ కర్ణాటకలో పర్యటించిన కొన్ని రోజులకే అధికారపార్టీ సీనియర్ నేత ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యింది.
'2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. ఇదే విషయంపై ఆయన సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు నాకు తెలిసింది. అందులో భాగంగా కర్ణాటక కూడా రెండు కాబోతోంది. ఈ క్రమంలో కొత్తగా ఉత్తర కర్ణాటక ఏర్పడేందుకు మనం పోరాడాలి' అంటూ మంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేష్ కత్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో రెండు, ఉత్తర్‌ప్రదేశ్‌లో నాలుగు, మహారాష్ట్రలో మూడు.. కొత్త రాష్ట్రాలు ఏర్పడతాయంటూ చెప్పుకొచ్చారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనేది మంచి అంశమేనన్న ఆయన.. ఉత్తర కర్ణాటక కూడా రాష్ట్రంగా ఏర్పడి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం విడిపోయినా ఎటువంటి హాని లేదని.. తామంతా కన్నడిగులుగానే ఉంటామని వ్యాఖ్యానించారు. 50 రాష్ట్రాల ప్రతిపాదన మంచిదేనని.. కర్ణాటకలో 60ఏళ్ల క్రితం రెండుకోట్ల జనాభా ఉంటే ఇప్పుడు ఆరున్నర కోట్లకు చేరిందని ఉమేష్ కత్తి పేర్కొన్నారు.
స్పందించిన సీఎం..: కర్ణాటకను విడగొట్టేందుకు ప్రధానమంత్రి స్థాయిలో చర్చలు జరుగుతున్నాయనే విషయం రాష్ట్రమంత్రి ద్వారా బయటపడిందని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం అంటూ ట్వీట్‌చేశారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న ఓ మంత్రే ఈ విషయాన్ని వెల్లడించడంపై ముఖ్యమంత్రి, పీఎంఓ కార్యాలయం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇలా మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా చేసే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై మాట్లాడడం ఆ మంత్రికి కొత్త కాదని.. ఎన్నో ఏళ్లుగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారని అన్నారు. ఆయన ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పుకోవాలంటూ కర్ణాటక సీఎం బదులిచ్చారు. ఇక ఇదే అంశంపై కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్ అశోకా మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం అంటూ ఉమేష్ ఇప్పటివరకు వందసార్లు మాట్లాడారని.. ఈసారి కొత్తేం కాదన్నారు. కర్ణాటక మొత్తం ఒక్కటేనన్న ఆయన.. ఉమ్మడి కర్ణాటక కోసం ఎంతోమంది కన్నడిగులు పోరాటం చేశారని అన్నారు. ఈ విషయంపై ఉమేష్‌తో ముఖ్యమంత్రి మాట్లాడుతారని వివరించారు.
ఇదీ చదవండి: రాహుల్ గాంధీ ఆఫీస్‌పై దాడి.. ఒకేసారి 100 మంది కలిసి...