అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. స్టాక్ మార్కెట్ల నియంత్రణ చర్యలను పటిష్ఠం చేసేందుకు ప్రతిపాదిత నిపుణుల కమిటీ పేర్లు సీల్డ్ కవర్‌లో స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పెట్టుబడిదారుల ప్రయోజనాల విషయంలో పూర్తి పారదర్శకతను కొనసాగించాలని కోరుతున్నామని.. సీల్డ్ కవర్‌లో నిపుణుల కమిటీ పేర్లపై కేంద్రం చేసిన సూచనను అంగీకరించబోమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. నిపుణుల కమిటీ సభ్యులపై న్యాయమూర్తులే నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. ఈ వ్యవహారంపై తామే ఒక కమిటీ ఏర్పాటు చేస్తామంటూ.. దర్యాప్తునకు ఆదేశించాలన్న పిటిషన్లపై తీర్పును వాయిదా వేసింది.
"మేము సీల్డ్ కవర్‌లో కేంద్రం ఇచ్చిన సూచనలను అంగీకరించం. పెట్టుబడిదారుల ప్రయోజనాల విషయంలో పూర్తి పారదర్శకతను కోరుకుంటున్నాం. ప్రభుత్వం సూచించిన సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తే.. అది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి సమానం అవుతుంది. అప్పుడు ప్రజల్లో కమిటీపై విశ్వాసం ఉండదు. కమిటీపై ప్రజలకు పూర్తిగా విశ్వాసం ఉండాలంటే మేమే నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తాం."
--సుప్రీంకోర్టు త్రిసభ్య దర్మాసనం
అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై దాఖలైన పలు పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిపింది జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నర్సింహ, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం. అంతకుముందు ఫిబ్రవరి 15న దేశ అత్యున్నత న్యాయస్థానానికి కేంద్రం సీల్డ్ కవర్‌లో తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఆ సీల్డ్ కవర్‌లో నిపుణుల కమిటీ కోసం కొన్ని పేర్లు సూచించింది. నిపుణుల కమిటీ ఏర్పాటులో ఎలాంటి జాప్యం చేయరాదని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. అదానీ వ్యవహారంపై ఫిబ్రవరి 13న ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ కమిటీ ద్వారా విచారణ జరగాలని కోరుకుంటున్నట్లు ధర్మాసనానికి తెలిపింది.
అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ అనే సంస్థ జనవరిలో అదానీ గ్రూప్‌పై ఓ సంచలన నివేదిక విడుదల చేసింది. ఆ తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ జరపాలని ప్రతిపక్షాలు నిరసన చేపట్టాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని పట్టుబట్టాయి. అదానీ వ్యవహారంపై కాంగ్రెస్, భాజపా పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. అలాగే పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. అదానీ వ్యవహారంపై విమర్శలు గుప్పించారు.