Abdul Kalam Musharraf on kashmir: సమయం, సందర్భం లేకుండా వివిధ వేదికలపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం పాకిస్థాన్‌కు కొత్తేమీ కాదు. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో నాటి పాక్ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ ఇలాంటి ప్రయత్నమే చేయబోగా ఆయన్ను కలాం వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. 2005 ఏప్రిల్‌లో భారత్ - పాక్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి ముషారఫ్ వచ్చారు. మ్యాచ్ అనంతరం ఆయన రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనుండగా.. ముషారఫ్ కచ్చితంగా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తారని కలాంకు ఆయన కార్యదర్శి పి.ఎం.నాయర్ చెప్పారు. శాస్త్రవేత్త అయిన కలాం ఈ విషయాన్ని ఎలా ఎదుర్కొంటారోనన్న ఉద్దేశంతో ముందే ఆయన్ను అప్రమత్తం చేశారు.
ఆ రోజు మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలవడంతో ముషారఫ్ ఉత్సాహంతో రాష్ట్రపతి భవన్‌కు వచ్చారు. వచ్చీరాగానే కుశల ప్రశ్నల అనంతరం ముషారఫ్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే కలాం సంభాషణ ప్రారంభించారు. "మిస్టర్ ప్రెసిడెంట్! మీ దేశంలోనూ కనీస సౌకర్యాలకు నోచుకోని పల్లెలు ఎక్కువ. వాటిని అభివృద్ధి చేయడానికి ఏదో ఒకటి చేయాలని మీకు అనిపించడం లేదా?" అని ప్రశ్నించారు. తిరిగి వెంటనే "ఇందుకోసం మేం 'పుర' (గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాల కల్పన) అనే పథకాన్ని అమలు చేస్తున్నాం" అంటూ కలాం దానికి సంబంధించి 26 నిమిషాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించారు. దీనికి ముగ్ధుడైన ముషారఫ్ కశ్మీర్ విషయాన్ని మరిచిపోయి కలాంను అభినందించి వీడ్కోలు తీసుకున్నారు. కలాం కార్యదర్శి నాయర్ ఈ విషయం గురించి తన పుస్తకం 'ద కలాం ఎఫెక్ట్, మై ఇయర్స్ విత్ ద ప్రెసిడెంట్'లో వివరించారు.
ఇదీ చదవండి: