Old Woman seeks euthanasia : ఆ వృద్ధురాలికి 11 మంది సంతానం. అయినా ఆమెను చూసుకునే వారు కరవయ్యారు. ఆకలి బాధతో ఆమె కారుణ్య మరణం కోసం అభ్యర్థిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన కర్ణాటకలోని హవేరీ జిల్లాలో జరిగింది. రణబెన్నూర్ పట్టణంలోని రంగనాథ నగర్‌కు చెందిన కొత్తూరు పుట్టవ్వకు ఏడుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. 20 మంది మనువలు, మనుమరాళ్లు కూడా ఉన్నారు. ఎనిమిది ఇళ్లు, 28 ఎకరాల పొలం సైతం ఉంది. అయినా ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదు. చనిపోయేందుకు అనుమతించాలని కోరుతున్నారు. హవేరీ జిల్లా కలెక్టరేట్ ద్వారా పుట్టవ్వ.. రాష్ట్రపతికి ఈ మేరకు లేఖ రాశారు.
"నా భర్త చనిపోయిన తర్వాత నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. నా పిల్లలు నన్ను చూసుకోవడం మానేశారు. చిన్న కొడుకు నా బాగోగులు చూసుకుంటున్నా.. మిగిలిన కొడుకులు నన్ను వేధిస్తున్నారు. నన్ను చూసుకుంటున్న చిన్న కొడుకును సైతం కొట్టేవారు. ఆదరిస్తారని కూతుళ్ల ఇంటికి వెళ్తే.. 'మా కుటుంబాలను నాశనం చేయడానికి వచ్చావా?' అంటూ వారు తిట్టేవారు."
-పుట్టవ్వ
అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పుట్టవ్వ.. కనీసం నిలబడలేని స్థితిలో ఉన్నారు. ఆస్తిని అమ్మేసి సొంతంగా బతుకుదామని అనుకున్నా.. దానికి ఆ వృద్ధురాలి సంతానం అడ్డుపడుతున్నారు. ఆస్తులు అమ్మనివ్వకుండా ఆమెను వేధిస్తున్నారు. కనీసం భోజనం కూడా పెట్టడం లేదని పుట్టవ్వ వాపోయారు. ఆకలి బాధ తట్టుకోలేక ఇరుగుపొరుగు వారిని అడిగి తినేదాన్నని కంటతడి పెట్టుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన పుట్టవ్వ.. కారుణ్య మరణం కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అంతకుముందు.. వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారుల ఎదుట ఆమె గోడును చెప్పుకున్నారు. పుట్టవ్వ సమస్యను విన్న అధికారులు కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేకుంటే వృద్ధాశ్రమంలో చేర్పిస్తామని అన్నారు. ఆస్తి వివాదం ట్రైబ్యునల్ కోర్టు పరిధిలో ఉన్నందున అందులోకి జోక్యం చేసుకోలేమని, ఈ విషయాన్ని హావేరి సబ్ డివిజనల్ అధికారులకు అప్పగించామని వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఉచిత వృద్ధాశ్రమంలో వసతి, ఆహారం వైద్య సదుపాయాలను అందిస్తామని, ఆమె కావాల్సినన్ని రోజులు అక్కడ ఉండొచ్చని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : భర్త పిలుస్తున్నాడని చెప్పి తీసుకెళ్లి.. మహిళపై సామూహిక అత్యాచారం
మైనర్‌పై వలస కూలీలు గ్యాంగ్‌రేప్.. రైల్వే ట్రాక్ దగ్గర వదిలి పరార్.. కోడలిని చంపిన మామ!