Operation Lotus BJP : పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ 'ఆపరేషన్ లోటస్' చేపట్టిందని ఆరోపించారు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా. ఇందుకోసం ఆ పార్టీ భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసేందుకు సిద్ధమైందని ఛండీగఢ్లో మీడియాతో చెప్పారు. ఈ సందర్భంగా భాజపాపై తీవ్ర ఆరోపణలు చేశారు హర్పాల్.
"గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్లో భాజపా గతంలో ఇలాంటి ఎత్తుగడలే వేసింది. ఇప్పుడు పంజాబ్లో అదే ప్రయత్నం చేస్తోంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు యత్నించింది. ఇందులో ఏడుగురిని నేరుగా లేదా మూడో వ్యక్తి ద్వారా సంప్రదించింది. కేంద్ర నిఘా వర్గాల ద్వారా కూడా శాసనసభ్యులపై ఒత్తిడి తెస్తోంది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు మొత్తం రూ.1,375 కోట్లు ఇచ్చేందుకు భాజపా సిద్ధమైంది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25కోట్లు ఆఫర్ చేసింది" అని ఆరోపించారు పంజాబ్ మంత్రి హర్పాల్ చీమా.
ఇటీవల దిల్లీ ప్రభుత్వం విషయంలోనూ భాజపాపై ఇదే తరహా ఆరోపణలు చేసింది ఆమ్ఆద్మీ పార్టీ. తమ పార్టీలో చీలికలు తెచ్చేందుకు భారతీయ జనతాపార్టీ చేసిన ఆపరేషన్ కమలం విఫలమైందని ఆగస్టులో ఆప్ నేతలు అన్నారు. పార్టీలో చీలిక తెచ్చేందుకు 12 మంది ఎమ్మెల్యేలను భాజపా సంప్రదించినట్లు ఆ పార్టీ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ఒక్కొక్కరికి రూ.20 కోట్లు చొప్పున ఇచ్చి 40 మంది ఎమ్మెల్యేలను చీల్చేందుకు యత్నించిందని చెప్పారు. అయితే ఆ ప్రయత్నాలను తమ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారని అన్నారు. ఎప్పటికీ తాము ఆమ్ ఆద్మీలోనే ఉంటామని వారంతా స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఇది జరిగిన కొద్దిరోజులకే.. సెప్టెంబర్ 1న శాసనసభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టుకుని నెగ్గారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.