మానసిక రుగ్మతతో బాధపడుతోన్న ఓ దివ్యాంగ యువకుడికి ఆధార్ కార్డు(Aadhaar card) ఆధారంగా నిలిచింది. 10 ఏళ్ల తర్వాత తన తల్లిదండ్రులను చేరేందుకు సాయపడింది. మధ్యప్రదేశ్‌లోని తన ఇంటి నుంచి తప్పిపోయి మహారాష్ట్ర చేరిన ఆ యువకుడి ఆధార్ కార్డుతో గుర్తించగలిగారు అతడ్ని చేరదీన వ్యక్తి.
ఇదీ జరిగింది..
2011లో మహారాష్ట్రలోని నాగ్‌పుర్ రైల్వే స్టేషన్లో మతిస్థిమితం సరిగా లేని ఓ బాలుడిని పోలీసులు గుర్తించి.. అనాథాశ్రమంలో చేర్పించారు. అయితే.. 2015లో ఆ ఆశ్రమాన్ని మూసివేశారు. దాంతో ఆ బాలుడిని దామ్లే అనే వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లాడు. తన పిల్లలతో సమానంగా చూసుకునేవాడు. పాఠశాలలో చేర్పించాడు.
"బాలుడు సరిగా మాట్లాడలేడని గుర్తించాను. నా దగ్గరకు వచ్చినప్పుడు కేవలం అమ్మా.. అమ్మా అంటూ తిరిగేవాడు. అతనికి అమన్ అనే పేరు పెట్టాను. 2015లో అనాథాశ్రమం మూసివేయాల్సి వచ్చింది. అమన్‌ని చూసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. నేనే నా కుటుంబ సభ్యునిగా చూసుకుంటున్నాను. నాకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు."
-దామ్లే, అనాథాశ్రమ నిర్వహకుడు
ఆధార్ అధారంగా..
ఈ ఏడాది ఆ యువకుడు పదవ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం అతని వయసు 18 ఏళ్లు. స్కూలులో ఆధార్ నెంబర్ కావాలని అడిగారు ఉపాధ్యాయులు. దీంతో ఆధార్ నమోదుకు దామ్లే ప్రయత్నించగా.. అతని వేలిముద్రలతో ఇప్పటికే ఆధార్ నమోదు చేసినట్లు తెలిసింది. పలుమార్లు ప్రయత్నించిన అనంతరం నాగ్‌పుర్‌లోని యూఐడీఏఐ కార్యాలయాన్ని సంప్రదించాడు దామ్లే. దీంతో అధికారుల చొరవతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్లో ఇప్పటికే ఆధార్ నమోదు చేసినట్లు తేలింది.
అతని పేరు మహమ్మద్ అమిర్‌గా గుర్తించారు. జబల్పుర్లో ఉన్న అధికారుల సహాయంతో అమిర్ తల్లితండ్రులు హనుమంతల్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలుసుకున్నారు. అనంతరం అమిర్‌ను వారికి అప్పగించారు.
తప్పిపోయిన తమ కొడుకు తిరిగి రావటం పట్ల అమిర్ తల్లితండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.