Aadhaar Free Update Last Date Extended : ఆధార్ అప్డేట్ చేసుకోవాలనుకునేవారికి గుడ్న్యూస్ చెప్పింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (UIDAI). ఉచితంగా ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది. తొలుత 2023 డిసెంబర్ 14 వరకు మాత్రమే ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా తాజాగా మరో 3నెలలు గడువు ఇచ్చింది. అంటే 2024 మార్చి 14 వరకు ఉచితంగా వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండడం వల్ల గడువు పెంచాలని నిర్ణయించినట్లు UIDAI ఓ ప్రకటనలో తెలిపింది. గడువు తర్వాత ఆధార్ డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఫీజు చెల్లించాలి.
ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు తగిన పత్రాలు సమర్పించి అందులో పొందుపరిచిన వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఉడాయ్ గతంలో సూచించింది. ఇకపై ప్రతి ఒక్కరూ కనీసం పదేళ్లకోసారి గుర్తింపు కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధి (సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ-సీఐడీఆర్)లోని వివరాలను అప్డేట్ చేసుకోవాలని తెలిపింది. ఈ ప్రక్రియ వల్ల పౌరుల సమాచారం సీఐడీఆర్ వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందని, ఇది కచ్చిత సమాచారం నిక్షిప్తమవడానికి దోహదం చేస్తుందని పేర్కొంది.
ఆధార్ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్ వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉడాయ్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి లేటెస్ట్ గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను సబ్మిట్ చేయాలి. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ ఫొటో పాస్‌బుక్, పాస్‌పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్‌షీట్, పాన్/ఈ-ప్యాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడతాయని ఉడాయ్ పేర్కొంది. విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా వినియోగించ్చుకోవచ్చని ఉడాయ్ తెలిపింది. ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన స్కాన్డ్ కాపీలను 'మై ఆధార్' వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఫింగర్ ప్రింట్స్ లేకున్నా ఐరిస్తో ఆధార్ జారీ- కేంద్రం కీలక నిర్ణయం
10 ఏళ్లుగా ఆధార్ అప్డేట్ చేయలేదా? ఆన్‌లైన్‌లో ఫ్రీగా వివరాలు మార్చుకోండిలా!