సాధారణంగా ఓ మహిళ ఒక కాన్పులో ఒక్కరు, ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలకు జన్మనిస్తుంది. కానీ, ఓ గర్భిణీ మాత్రం ఏకంగా ఒకేసారి నలుగురు నవజాత శిశువులకు జన్మనిచ్చింది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ సంఘటన అసోం కరింగంజ్ జిల్లాలోని బజారిచర ప్రాంతంలోని క్రిస్టియన్ మిషనరీ ఆస్పత్రిలో జరిగింది. వీరిలో ముగ్గురు అబ్బాయిలు కాగా.. ఒక అమ్మాయి ఉంది. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలోని ప్రత్యేక బేబీ కేర్ యూనిట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
దక్షిణ కరింగంజ్లోని నీలం బజార్‌కు చెందిన లాస్టింగ్ ఖచియా, జనతా ఖచియా దంపతులు. ఈ నలుగురు శిశువులు పుట్టక ముందే వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే రెండో కాన్పు కోసం జనతా ఖచియాను సోమవారం (ఏప్రిల్ 17న) తెల్లవారుజామున 3 గంటల సమయంలో క్రిస్టియన్ మిషనరీ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అనంతరం ఆమెను వైద్యులు పరీక్షించారు. ఈ క్రమంలో ఆమె గర్భంలో నలుగురు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స అవసరమని భావించిన డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేశారు.
మంగళవారం ఉదయం 7 గంటలకు పండంటి నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది జనతా ఖచియా. వీరిలో ముగ్గురు మగపిల్లలు.. ఒక్క ఆడబిడ్డ అని వైద్యులు ధ్రువీకరించారు. ఇంతకు ముందు తమ ఆస్పత్రిలో ఒకేసారి నలుగురు పిల్లలు పుట్టిన సందర్భాలు లేవని.. ఇదే మొదటి కేసు అని ఇన్ఛార్జ్ డాక్టర్ చందన్ తెలిపారు. ప్రస్తుతం తల్లి పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఈ నవజాత శిశువుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తెలంగాణలోనూ ఈ తరహా కాన్పు..!
మార్చిలో కూడా అచ్చం ఈ తరహా అరుదైన సంఘటనే తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పీపుల్స్ ప్రైవేటు ఆసుపత్రిలో వెలుగు చూసింది. గంభీరావుపేట మండలం సముద్రలింగాపుర్‌కు చెందిన గొట్టిముక్కుల లావణ్య, కిషన్ దంపతులు. వీరిద్దరూ దినసరి కూలీలు. వీరికి మూడో తరగతి చదివే బాబు కుడా ఉన్నాడు. ఇటీవలే జరిగిన రెండో కాన్పులో ముగ్గురు మగ శిశువులు, ఒక ఆడశిశువుకు లావణ్య జన్మనిచ్చింది. శస్త్రచికిత్స చేసి నలుగురు పిల్లలను విజయవంతంగా బయటకు తీసింది ప్రత్యేక డాక్టర్ల బృందం. కాగా, పిల్లలు ఒక్కొక్కరు 1.25 కేజీల బరువు ఉన్నారు. ప్రస్తుతం తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నారని డాక్టర్ శంకర్ తెలిపారు. 10 లక్షల్లో ఒకరికి ఇలా జరుగుతుందని.. ఇది అరుదైన కాన్పు అని ఆయన పేర్కొన్నారు.