RAPE ON WOMAN IN VIJAYAWADA : చిన్నారులు, మహిళలపై కామాంధుల వేధింపులు మాత్రం ఆగడం లేదు. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని శిక్షలు పడ్డ మాకు సంబంధం లేదనుకుంటూ వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వారి వేధింపులు భరించలేని కొందరు మహిళలు ధైర్యంగా బయటి ప్రపంచలో వస్తూ ఎదుర్కొంటుంటే.. మరి కొంతమంది మాత్రం కుటుంబ పరువు, భయం కారణంగా వాళ్లల్లో వాళ్లు మానసికంగా కుంగిపోయి ఎవరికి చెప్పుకోలేక.. అలా అని లోకంలో బతకలేక తనువులు చాలిస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఆ ఘటనలు జరిగిన చాలా రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ సంవత్సరం నుంచి ఓ వ్యక్తి పడుతున్న వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించింది.
ఓ మహిళ స్నానం చేస్తుండగా అతడు దొంగచాటుగా ఫొటోలు తీశాడు. వాటిని ఆమెకు చూపించి బెదిరించాడు. తన మాట వినకపోతే ఫొటోలు బయట పెడతానంటూ వేధించాడు. అదే అదనుగా పలుమార్లు అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా.. లక్షల రూపాయలు నగదు తీసుకున్నాడు. ఆ నగదు ఇవ్వాలని తిరిగి అడిగినందుకు తిరిగి ఆమె పైనే దాడికి పాల్పడ్డాడు. చివరికి అతడి వేధింపులు తాళలేని బాధితురాలు.. తన కుటుంబ సభ్యుల సాయంతో విజయవాడ నగరంలోని నున్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సుభాష్‌ను అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నున్న స్టేషన్ పరిధిలోని విశాలాంధ్ర కాలనీకి చెందిన పుట్టా సుభాష్(45) అనే వ్యక్తి బీపీసీఎల్ కంపెనీలో పైప్‌లైన్ సెట్టింగ్ పనులు చేస్తుంటాడు. పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ(35) శాంతినగర్‌లో తన భర్తతో కలిసి పచారీ దుకాణం నడుపుతోంది. సుభాష్.. దుకాణంలో సరకులు కొనుగోలు చేసి, ఫోన్ పే, గూగుల్ పే, పేటియం ద్వారా పలుమార్లు నగదు చెల్లింపులు చేసే సందర్భంలో ఆ మహిళ ఫోన్ నెంబరును తెలుసుకున్నాడు.
అలా.. సరకులకు వెళ్లినప్పుడల్లా ఆమెతో మాటలు కలిపాడు. ఆ క్రమంలోనే ఒక రోజున ఆమె.. రాజీవ్‌నగర్‌లోని ఇంటి వద్ద స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫొటోలు తీశాడు. వాటిని ఆమెకు చూపించి, తన మాట వినకపోతే ఫొటోలు బయట వ్యక్తులకు చూపుతానంటూ, సోషల్ మీడియాలో పోస్టు చేస్తాఅంటూ బెదిరించాడు. ఆమె వద్దని వారిస్తున్నా.. బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా వదలిపెట్టలేదు. ఇంట్లో ఎవరూ లేని టైంలో పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు.
అక్కడితో ఆగకుండా.. ఆమెను బెదిరించి 16లక్షల రూపాయల సొమ్మను తీసుకున్నాడు. తిరిగి ఇవ్వాలని అడిగితే.. ఆమె పైనే దాడి చేశాడు. సంవత్సరం నుంచి ఆమె పై అత్యాచారం చేయడం, తాజాగా ఆమెను కొట్టడంతో వేధింపులు భరించలేని బాధితురాలు.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. కుటుంబ సభ్యుల సహకారంతో సుభాష్‌పై బుధవారం ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. గురువారం నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితుడు సుభాష్‌కు రిమాండ్ విధించినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
ఇవీ చదవండి: