కరోనా మహమ్మారిని తరిమికొట్టే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన వైద్య సిబ్బందే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు మహిళలు కరోనా టీకా కోసం వెళ్తే.. యాంటీ రేబిస్ టీకాలు ఇవ్వడం కలకలం రేపింది. తాజాగా.. అదే రాష్ట్రంలో కొవాగ్జిన్ టీకా తొలి డోసు తీసుకున్న ఓ వ్యక్తికి, రెండో డోసుగా కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు. మహరాజ్‌గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఇదీ జరిగింది..
మహరాజ్‌గంజ్ జిల్లా చీఫ్ డెవలప్‌మెంట్ అధికారికి డ్రైవర్లుగా పనిచేస్తున్న ఉమేశ్, చందన్, మదన్ మార్చిలో కొవాగ్జిన్ తొలి డోసు తీసుకున్నారు. ఇప్పుడు.. రెండో డోసు కోసం జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. అయితే.. తొలుత ఉమేశ్‌కు మొదటి డోసు ఇచ్చిన వైద్య సిబ్బంది.. కొవాగ్జిన్‌కు బదులు కొవిషీల్డ్ టీకా వేశారు. పొరపాటును గ్రహించి మిగతా ఇద్దరికి రెండో డోసు ఇవ్వలేదు.
ఈ ఘటన వివాదాస్పదంగా మారడం వల్ల ముఖ్య వైద్యాధికారి ఏకే శ్రీవాస్తవ స్పందించారు. ఈ ఘటన జరగకుండా ఉండాల్సిందన్న ఆయన.. టీకా తీసుకున్న ఉమేశ్‌లో ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని తెలిపారు. తొలి డోసులో ఇచ్చిన టీకానే రెండోసారి కూడా ఇవ్వాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
ఇదీ చదవండి: కఠిన ఆంక్షల నడుమ 'మహా'నగరాలు