Murder in Mangalore: కర్ణాటకలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలో భాజపా యువనేత ప్రవీణ్ నెట్టార్ హత్య మరువక ముందే మరో ఘటన జరిగింది. మంగళూరు నగరంలో గురువారం సాయంత్రం స్థానిక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాధితుడ్ని మహ్మద్ ఫాజిల్‌గా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మంగళూరు నగర శివార్లలో ఉన్న సూరత్కల్ ప్రాంతంలో ఓ వస్త్ర దుకాణం వద్ద.. బాధితుడు నిల్చొని ఉన్నాడు. అదే సమయంలో నలుగురు దుండగులు అక్కడికి వచ్చారు. ఒక్కసారిగా కత్తి తీసి ఫాజిల్‌ను పొడిచారు. వెంటనే దుండగులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఫాజిల్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఉదయం బాధితుడి అంత్యక్రియలు జరిగాయి.
సీఎం వెళ్లి వస్తున్న సమయంలోనే..
మంగళవారం దుండగుల చేతిలో హత్యకు గురైన దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన భాజపా యువనాయకుడు ప్రవీణ్ నెట్టార్ ఇంటికి.. గురువారం సాయంత్రం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పరామర్శకు వెళ్లారు. ప్రవీణ్ కుటుంబానికి సీఎం.. రూ.25 లక్షల చెక్కును అందజేసి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు కూడా కట్టిస్తామని తెలిపారు. అయితే సీఎం.. ప్రవీణ్ ఇంటికి వెళ్లి వస్తున్న సమయంలోనే మంగళూరు నగరంలో యువకుడి హత్య జరగడం చర్చనీయాంశమైంది.
వ్యక్తిగత కక్షలతో యువకుడి దారుణ హత్య!
Young Man Murder: మహారాష్ట్ర.. పుణె నగరంలోనూ దారుణం జరిగింది. ఓ యువకుడ్ని కత్తితో పొడిచి.. ఆపై సిమెంట్ రాయితో అతడి తలపై కొట్టి కిరాతకంగా హత్య చేశారు ఇద్దరు వ్యక్తులు. బాధితుడ్ని అక్షయ్ లక్ష్మణ్ వలాల్గా గుర్తించారు పోలీసులు.
పోలీసుల వివరాల ప్రకారం.. పుణె నగరానికి చెందిన బాధితుడు స్థానికంగా ఉన్న ఓ లాండ్రీ దుకాణం వద్ద మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నిల్చొని ఉన్నారు. అదే సమయంలో మహేశ్, కిషోర్ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి అక్షయ్‌ను హత్య చేశారు. వెంటనే నిందితులు అక్కడ నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీలో ఘటనా దృశ్యాలు రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. వ్యక్తిగత కక్షల కారణంగానే నిందితులు.. బాధితుడ్ని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇవీ చదవండి: మృతదేహాన్ని తాడుకట్టి ఈడ్చుకెళ్లి.. ట్రాక్టర్లో ఎక్కించి..
రైల్లో అర్ధరాత్రి పాము హల్చల్.. బెంబేలెత్తిన ప్రయాణికులు.. ట్రైన్‌ను నిలిపివేసినా..