కొన్నేళ్ల క్రితం బిహార్‌కు చెందిన దశరథ్ మాంఝీ అనే వృద్ధుడు తన గ్రామం కోసం ఎవరూ చేయని సాహసమే చేశాడు. తమ ఊరికి రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న పెద్ద కొండను ఒక్కడే తవ్వి మరి గ్రామస్థులు వెళ్లేందుకు దారి వేశాడు. దీంతో ఈయన 'మౌంటెయిన్ మ్యాన్‌గా' గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా గుజరాత్‌కు చెందిన ఓ రైతు తన గ్రామంలోని నీటి సమస్యను చూసి చలించిపోయి.. ఏకంగా 40 అడుగుల ఓ బావిని తవ్వాడు. దీంతో ఆ గ్రామంలో నీటి కష్టాలు కొంతమేర గట్టెక్కాయి. దీంతో గుజరాత్ కా మాంఝీ అని పిలుస్తున్నారు.
4 నెలలు.. 40 అడుగులు..
ఛోటా ఉదేపుర్ జిల్లా మహుడి గ్రామానికి చెందిన ఖుషాల్ భిల్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన గ్రామంలో తాగు, సాగునీటి సమస్య తలెత్తడం వల్ల తన వంతుగా గ్రామానికి సహాయపడాలని నిశ్చయించుకున్నాడు. కేవలం 4 నెలల్లోనే 40 అడుగుల లోతు బావిని తవ్వానని ఖుషాల్ చెబుతున్నాడు. అయితే బావి తవ్విన వెంటనే అందులో నుంచి నీరు రాకపోవడం వల్ల ఖుషాల్ నిరాశ పడలేదు. వర్షాలు కురిసేంత వరకు ఓపికతో బావిని తవ్వుతూనే ఉన్నాడు. కాగా, ఈ కార్యంలో ఖుషాల్ భార్య కూడా అతడికి సాయపడింది.
"నీరు అనేది ప్రకృతి మనకిచ్చిన ఓ ఉచిత వరం.. అందుకే నీటి విలువ ఎవరికీ అర్థం కావడం లేదు. వేల లీటర్ల నీటిని వృథాగా పోనిస్తున్నారు. నీరు లేకుంటే ఏ పనులు జరగవు. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బావుల్లో నీరు చేరుతుంది. బంతువులు, పక్షులు నీరు తాగేందుకు ఈ బావులు ఉపయోగపడుతున్నాయి. ఇంటి దగ్గర చేతి బోరింగ్ పంపు ఉన్నప్పటికీ అందులో నుంచి వచ్చే నీరు తాగడానికి పనికిరావు. దీంతో గ్రామంలో నీటి సమస్యను తీర్చేందుకు రాత్రింబవళ్లు కష్టపడి ఈ బావిని తవ్వాను. ఇందుకు నాకు 4 నెలల సమయం పట్టింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు బావి పక్కనే బోరు వేశారు. దీంతో మా నీటి కష్టాలు కొంతమేర తీరాయి."
-- ఖుషాల్ భిల్, యువ రైతు (బావి తవ్విన వ్యక్తి)
ప్రస్తుతం గుజరాత్ ప్రభుత్వం సుజలాం సుఫలాం పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా తాగు, సాగు నీరు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఖుషాల్ భిల్ తవ్విన బావి విషయం అధికారుల దృష్టికి వెళ్లడం వల్ల ఈ నెల 22న సంబంధిత శాఖ ఖుషాల్ తవ్విన బావిని సందర్శించారు. అనంతరం పక్కనే బోరును కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఆ బావిలో 500 అడుగుల మేర నీరు రావడం వల్ల మహుడి గ్రామస్థులు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.