తౌక్టే తుపాను బీభత్సంతో అతలాకుతలమైన పలు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తరుణంలో.. మరో తుపాను భారత్‌పై విరుచుకుపడేందుకు సిద్ధమైంది. మే 25న బంగాళాఖాతంలో.. 'యాస్' తుపాను ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది.
ఈ తుపాను వాయవ్య దిశగా చురుగ్గా కదులుతూ.. మే 26 సాయంత్రం బంగాల్, ఒడిశా తీరాలను తాకే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. వాతావరణ పరిస్థితులు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా.. 22, 23 తేదీల్లో ఆగ్నేయ బంగాళాఖాతం మేఘావృతం కానుందని ఐఎండీ అంచనా వేసింది. 22న అల్పపీడనం ఏర్పడి తరువాత 72 గంటల్లో బలపడి అది తుపానుగా మారే అవకాశముందని ఐఎండీ అభిప్రాయపడింది. ఆపై బంగాల్, ఒడిశా తీరాలను తాకనుందని అంచనా వేసింది.
తుపాను పరిస్థితుల దృష్ట్యా మే 24 నుంచి.. మత్యకారులు సముద్రంలోకి వెళ్లకపోవడం మంచిదని ఐఎండీ సూచించింది. ఈ తుపాను ప్రభావంతో మే 25న బంగాల్ తీర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు పేర్కొంది.
'యంత్రాంగం సిద్ధంగా ఉండాలి..'
తుపాను హెచ్చరికల నేపథ్యంలో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించేందుకు కృషి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించిన మమతా.. ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఔషధాలు, ఆహార పదార్ధాలు సమకూర్చుకోవాలన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు.
ఇవీ చదవండి: తుపాను తక్షణ సాయం- గుజరాత్‌కు రూ.వెయ్యి కోట్లు